‘ఫాస్ట్‌’గా నిర్ణయాలు

4
1956 ముందున్న వారికే బోధనా రుసుము

విధివిధానాల కోసం కమిటీ

హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : ఫాస్ట్‌ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు 1956కు ముందు తెలంగాణలో నివసించిన వారే అర్హులని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫాస్ట్‌ పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. 1956కు ముందున్న వారికే పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు అని, ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. ఈ సంవత్సరం నుంచే విధివిధానాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, ఉన్నత విద్య, పంచాయతీ రాజ్‌, సాధారణ పరిపాలన, న్యాయశాఖ కార్యదర్శులు ఉంటారు. స్థానికతను నిర్ధారిస్తూ రెవెన్యూ శాఖ ఈ-ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

స్థానికత నిర్ధారణకు ఈ-ధ్రువీకరణ

1956 స్థానికత ఆధారంగానే మార్గదర్శకాలు రూపొందించాలని కమిటీకి ప్రభుత్వం నిర్దేశించింది. ముందుగా కొత్తగా వచ్చే విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా చేయాలని భావించిన ప్రభుత్వం.. అందులో పలుమార్పులు చేసింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థులకు సైతం ఈ విధివిధానాలు వర్తించేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది. 1956కు ముందు తెలంగాణలో ఉన్న కుటుంబాల పిల్లలే ఫాస్ట్‌ పథకానికి అర్హులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ తర్వాత తెలంగాణలో స్థిరపడిన వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందదు. ఈ మేరకు 1956కు ముందు తెలంగాణలో ఉన్న వారిని గుర్తించి, వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసే ప్రక్రియను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే రెవెన్యూ శాఖ అధికారులు ఈ-ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు.

స్థానికులకే లబ్ధి

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 1956 కటాఫ్‌ ప్రతిపాదనపై అనుమానాలు వెలువడుతున్నాయి. 1956కు ముందున్న వారిని గుర్తించడం ఎలా? వారిని ఎలా గుర్తిస్తారు, ఆ తర్వాత వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి పరిస్థితి ఏమిటి? ఇక్కడే పుట్టి ఇక్కడే చదివిన విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడం వంటి అంశాలపై స్పష్టత లోపించింది. అయితే, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే బోధనా రుసుమలు ఇస్తామని, సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ఫీజులు చెల్లించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫాస్ట్‌  పథకం ద్వారా తెలంగాణ వారికే లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడిన కేసీఆర్‌ సర్కారు.. దాని స్థానంలో ఫాస్ట్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. 1956కు ముందు తెలంగాణలో నివసించిన కుటుంబాల పిల్లలకే ఫీజులు చెల్లిస్తామని స్పష్టం చేసింది. సీమాంధ్రకు చెందిన వారికి అక్కడి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని స్పష్టం చేసింది.