అధికారుల అలక్ష్యం.. నీటమునిగిన జూరాల
మహబూబ్‌నగర్, జులై31 (జనంసాక్షి) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా జలశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పాలమూరు జిల్లాలో జూరాల జలాశయంలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్ ఉన్న జూరాల నుంచి కిందికి నీరు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో లక్షా 5వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 49వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 78,353 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 831.80 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 831.8 అడుగులకు చేరుకుంది. డ్యాం నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 51.3 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 78 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 34 వేల క్యూసెక్కులు ఔట్‌ఫ్లోగా ఉంది. ఇదిలావుంటే దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దిగువ జూరాల జలవిద్యుత్తు కేంద్రం నీటమునగడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. దీనివల్ల భారీ ఆస్తినష్టం జరిగిందని సూచనప్రాయంగా వెల్లడించారు. జరిగిన ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించామన్న ఆయన వారం రోజుల్లో అన్ని యూనిట్లను పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు.
జూరాలకు భారీగా వస్తున్న వరదల వల్ల దిగువజూరాల జలవిద్యుత్ కేంద్రం నీటమునిగింది. పవర్‌హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని గుండాల జలపాతం వద్ద దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం నిర్మితమవుతోంది. ఇప్పటికే ఒక యూనిట్ సన్నాహాక పరీక్ష పూర్తికాగా, మరో యూనిట్ సన్నాహక పరీక్షకు సిద్దమైంది. విద్యుత్ ఉప కేంద్రం వద్ద అధికారులు నీటి ఉద్ధృతిని అంచనా వేయలేక పోవడంతో వరదనీరు ఒక్కసారిగా పవర్‌హౌస్‌లోకి చేరింది. వరదనీరు మళ్లింపు కాలువ ద్వారా వచ్చిన నీరు 4,5,6 యూనిట్లకు ఏర్పాటు చేసిన తాత్కాలిక గేట్లు కొట్టుకుపోయాయి. దీంతో విలువైన యంత్ర సామాగ్రి నీటమునిగింది. పవర్‌హౌస్ పూర్తిగా వరదనీటితో నిండిపోవడంతో జెన్‌కోకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనావేస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రాన్ని సివిల్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస పరిశీలించారు.