మా కోర్టు మాగ్గావాలె

3A3B
ప్రత్యేక హైకోర్టుకు టి.న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ‘మా కోర్టు మాగ్గావలె’ అంటూ తెలంగాణ న్యాయవాదులు గురువారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా చలో హైకోర్టు కార్యక్రమాన్ని తెలంగాణ న్యాయవాదులు చేపట్టారు. తెలంగాణలోను వివిధ జిల్లాల నుంచి వస్తున్న న్యాయవాదులను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. అప్పటికీ తెలంగాణలోని పది జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకొని హై కోర్టు ఎదుట రిలే నిరాహారదీక్షలకు దిగారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ గత 60 సంవత్సరాల తెలంగాణ కల సాకారమైన ఇక హైకోర్టు ఉమ్మడిగా ఉండడం సరికాదని అన్నారు. గత 16 రోజుల నుంచి ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన చేపడుతున్నా కేంద్రంనుండి ఎలాంటి స్పందన లేదనివారు విమర్శించారు. శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాగే ప్రత్యేక హైకోర్టును కూడా సాధించుకుంటామని వారు అన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడుల మధ్య ప్రధాని నరేంద్రమోడీ చిక్కుకొని వారి కుట్రలకు బలికావద్దని వారు సలహా ఇచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ముఖ్యంగా మూడు చిన్నరాష్ట్రాలను ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి, యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టును ఎందుకు ఏర్పాటు చేయడం లేదని వారు ప్రశ్నించారు. రాజ్యాంగంలో హైకోర్టుపై స్పష్టంగా ఉందని వారు అన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. చేపట్టిన ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని వారు అన్నారు.