మన వర్శిటీలు.. మన పేర్లు
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక జయశంకర్ వర్శిటీ
వెటర్నరీ వర్శిటీకి పివి పేరు
హైదరాబాద్, జులై 31(జనంసాక్షి) : తెలంగాణలోని రెండు యూనివర్సిటీల పేర్లను మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పివి పేరు ఓ విశ్వవిద్యాలయానికి పెడతామన్న సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు వెటర్నరీ యూనివర్సిటీకి ఆయన పేరుపెట్టారు. గత కేబినేట్‌లోనే దీనిపై నిర్ణయం జరిగింది. ఈ మేరకు రాజేంద్రనగర్ శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పేరును పీవీ నర్సింహరావు తెలంగాణ స్టేట్ వర్సిటీగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాజేంద్రనగర్‌లో పీవీ నర్సింహరావు పేరుతో వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పేరును ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రముఖుల పేర్లతో ఈ యూనివర్సిటీల పేర్లు మార్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదిలావుంటే తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం ఉన్న పొట్టి శ్రీరాములు పేరును కూడా తొలగించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆంధ్రా పేర్లున్న వాటిలో తెలంగాణ ప్రముఖుల పేర్లను పెట్టే ప్రతిపాదనలు ఉన్నాయి. కెబిఆర్ పార్క్ పేరును కూడా మార్చాలని ఇప్పటికే డిమాండ్ వచ్చింది.