సోనియా మనస్తాపం చెందిందనడానికి అదే రుజువు

2
నట్వర్‌ సింగ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మనస్తాపం చెందిందనడానికి ఆమె తీవ్ర ప్రతిస్పందనే నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకుడు నట్వర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. తన పుస్తకంలో ‘వాస్తవాలు చెప్పినందుకు’ తనను అభినందిస్తూ దాదాపు 50మంది కాంగ్రెస్‌ వాదులు తనకు ఫోన్‌ చేశారని ఎన్డీటివికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. నట్వర్‌ సింగ్‌ రాసిన ఆత్మకథలో తనపై చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ గురువారం స్పందిస్తూ, ”నా ఆత్మకథను రాస్తాను. వాస్తవాలు ఏమిటో విూకు తెలుస్తాయి” అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు విూడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు రాసిన పుస్తకంపై స్పందించని సోనియా గాంధీ తన పుస్తకంలోని అంశాలపై స్పందించడమే గణనీయమైన విషయమని నట్వర్‌ వ్యాఖ్యానించారు. దీనికి కారణం తన పుస్తకంలోని వ్యాఖ్యలు ఆమెను బలంగా తాకాయని, తీవ్ర మనస్తాపంతోనే ఆమె బయటపడ్డారని ఆయన చెప్పారు. తన పుస్తకంలోని అంశాలను ‘మార్కెటింగ్‌ గిమ్మిక్కు’గా మన్మోహన్‌ సింగ్‌ అభివర్ణించడంపై స్పందిస్తూ, ”సంజయ్‌ బారు చెప్పినవి, నేను చెప్పినవి.. మరెందరో చెప్పినవే అసలు వాస్తవాలు” అని నట్వర్‌ చెప్పారు.

రాహుల్‌ గాంధీపై మాట్లాడుతూ, ‘ధృఢచిత్తం ఉన్న వ్యక్తి.. ‘ఎవరి బలవంతం విూదో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు’ అని అభిప్రాయపడ్డారు. అయితే, పూర్తికాలం రాజకీయ నాయకుడిగా సేవచేయాలన్న ‘తృష్ణ’ ఆయనకు లేదని నట్వర్‌ వ్యాఖ్యానించారు. ‘ఆయనో(రాహుల్‌) గొప్ప తెలివితేటలున్న రాజకీయ నాయకుడు కాకపోవచ్చు. కాని, ఒక మనిషిగా చాలా దృఢ మనస్కుడు. తన సొంత జీవితం గురించి ఆయన భయపడతారని నేను భావించను” అని నట్వర్‌ చెప్పారు. సోనియా గాంధీ త్వరలోనే తన పుస్తకాన్ని రాస్తే దాన్ని చదవాలని తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. నట్వర్‌ రాసిన ‘ఒన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌-మై ఆటోబయోగ్రఫి (ఒక జీవితం చాలదు-నా ఆత్మకథ’) శుక్రవారం మార్కెట్లో విడుదలైంది.