మావోయిస్టు దంపతుల లొంగుబాటు

3
హైదరాబాద్‌, ఆగస్ట్‌1 (జనంసాక్షి) : మావోయిస్టు అగ్రనేత కె.రవీందర్‌ అలియాస్‌ అర్జున్‌ దంపతులు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. వీరిద్దరు మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. గతంలో చత్తీస్‌గఢ్‌ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జిగా అర్జున్‌ బాధ్యతలు నిర్వహించారు. దండకారుణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలోనూ, మావోయిస్టు ఫోర్స్‌ ఇన్‌చార్జిగా కూడా అర్జున్‌ పనిచేసినట్లు తెలుస్తోంది. అలాగే మావోయిస్టు కేంద్ర కమిటీలోనూ అర్జున్‌ కీలక బాధ్యతలు నిర్వహించారు. అర్జున్‌, అతని భార్యపై రూ.25 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 25 సంవత్సరాలుగా ఆయన మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. రవీందర్‌తోపాటు ఆయన భార్య లలిత కూడా మావోయిస్టుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. రవీందర్‌ మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా దండకారణ్య స్పషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు మొబైల్‌ స్కూల్స్‌కి ఇన్‌ఛార్జిగా రవీందర్‌ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. దీంతో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కుక్కల రవీందర్‌ అలియాస్‌ అర్జున్‌ను పోలీసు అరెస్ట్‌ చేశారు. రవీందర్‌తో పాటు భార్య అడవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన అర్జున్‌ 25ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నాడు. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దర్ని పోలీసులు ఖమ్మం జిల్లాలో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. రవీందర్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరి అరెస్టును పోలీసులు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో సంచరిస్తున్నారనే వార్తలతో పోలీసులు అప్రమత్తం అయిన విషయం తెలిసిందే. మాచ్‌ఖండ్‌, సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో దళసభ్యులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్‌ ఉధృతం చేశారు. కొద్దిరోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండాను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారని సమాచారం.