కాల్పుల విరమణ హుష్‌కాకి

5A5B
యథేచ్ఛగా ఇజ్రాయిల్‌ దాడులు

యుఎస్‌, యుఎన్‌ సీజ్‌ఫైర్‌ ప్రకటన బేఖాతరు

తాజా దాడుల్లో 50మంది మృతి

1500కు చేరిన మృతులు

ఇజ్రాయిల్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించిన బొలీవియా

గాజా, ఆగస్టు 1(జనంసాక్షి) : కాల్పుల విరమణ ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే ఇజ్రాయెల్‌ మరోసారి గాజాపై యథేచ్ఛగా దాడులకు పాల్పడింది. యుఎస్‌, యుఎన్‌ సీజ్‌ఫైర్‌ ప్రకటనను బేఖాతరు చేసింది. తాజాగా చేసిన బాంబు దాడుల్లో 50 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌ను టెర్రరిస్టు దేశంగా బొలీవియా ప్రకటించింది. తాము కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే ఉగ్రవాదులు చొచ్చుకొచ్చారని, ఓ ఇజ్రాయెలీ సైనికుడిని కూడా వారు పట్టుకున్నారని చెబుతూ ఈ దాడులు చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీమూన్‌ కలిసి 72గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఇప్పటికైనా శాంతి నెలకొంటుందని భావించారు. ఇప్పటికి మూడు వారాలకుపైగా జరుగుతున్న పోరాటాన్ని ఆపేందుకు చేపట్టిన ఈ చర్య సత్ఫలితాలిస్తుందని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు.

హమాస్‌ ఇస్లామిక్‌ ప్రాంతమైన గాజాపై జూలై 8వ తేదీ నుంచి ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించింది. ప్రధానంగా వాయు మార్గంలోను, జలమార్గం నుంచి కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది. అలాగే సరిహద్దుల నుంచి రాకెట్లతో దాడులు చేస్తోంది. జూలై 17వ తేదీన ట్యాంకులు, పదాతిదళం కూడా రంగప్రవేశం చేశాయి. ఇప్పటివరకు దాదాపు 1500 మంది పాలస్తీనియన్లు మరణించగా 7వేల మంది వరకు గాయపడినట్లు గాజా అధికారులు తెలిపారు. పరస్పర దాడులు జరగడంతో 61 మంది ఇజ్రాయెలీ సైనికులు మరణించారు. 400 మంది వరకు గాయపడ్డారు. చిన్న పిల్లలు కూడా తీవ్రంగా గాయాలపాలు కావడంతో ఆ ప్రాంతమంతా అత్యంత భయానకంగా ఉంది.