గృహ నిర్మాణంలో కలిసి పనిచేద్దాం

2
ప్రపంచ మేయర్ల సదస్సుకు మోడీని ఆహ్వానిద్దాం

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : గృహ నిర్మాణ రంగంలో కలిసి పనిచేద్దామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేయర్ల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని తానే స్వయంగా ఆహ్వానిస్తానన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మేరకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాలుగా సహకారం అందించాలని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు శనివారం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది అంశాలు, నూతన పథకాలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. వెంకయ్యతో భేటీ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగుతున్న పట్టణాభివృద్ధి పనులపై సీఎం చర్చించారని పేర్కొంది. ప్రత్యేక గృహ నిర్మాణ పథకాలను తీసుకొచ్చే బదులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టాలని కేసీఆర్‌ కేంద్రానికి ప్రతిపాదించారు. గతంలో కేంద్ర పట్టణ గృహ నిర్మాణం పథకం కింద నిర్మించిన 29 వేల ఇళ్లలో ఎవరూ ఉండడంలేదని ఎత్తిచూపారు. వాటిపై కనీసం పర్యవేక్షణ కూడా లేదని తెలిపారు. కరెంటు, నీళ్లు, రోడ్లు సదుపాయాలు లేకుండా ఇళ్లు కట్టారని.. ఆ ఇళ్లు కూడా పిట్టగూళ్లలా ఉన్నాయని వెంకయ్య వద్ద ప్రస్తావించారు. అందుకే కేంద్ర, రాష్టాల్ర భాగస్వామ్యంతో పటిష్టమైన గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొస్తఉందని ప్రతిపాదించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో టాయిలెట్‌ నిర్మాణ పథకాన్ని పునరద్ధరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండాలంటే రాజకీయాలను, పరిపాలనను వేర్వేరుగా చూడాలని కేసీఆర్‌ సూచించారు. పలు పట్టణాలు, నగరాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద పలు పథకాలు సిద్ధమయ్యాయని, కార్యాచరణే మిగిలిందన్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ మేయర్ల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరైతే బాగుంటుందని కేసీఆర్‌ అభిప్రాయడ్డారు. కార్యక్రమానికి రావాలని మోడీని స్వయంగా తానే ఆహ్వానిస్తానని తెలిపారు. 100 దేశాల నుంచి మేయర్లు, కమిషనర్లు కలిపి 1500 మంది హాజరుకానున్నారని వివరించారు.