తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు

3

టి.సర్కారు మరో కీలక నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటుకు టి.సర్కారు శ్రీకారం చుట్టింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తూ శనివారం జీవో  నెం.5 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ యాక్ట్‌-1988ను తెలంగాణ రాష్టాన్రికి అన్వయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 101 ప్రకారం ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జూన్‌ 2 నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఉన్నత విద్యామండలిలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఓయూ, కేయూ, జేఎన్టీయూ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల వైస్‌చాన్సలర్లను నియమించింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్‌ గడువును పొడగించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే, కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో వివాదం ముదిరింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించడం తమ బాద్యత అని, ఆ మేరకు షెడ్యూల్‌ విడుదల చేశామని విద్యా మండలి తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. అయితే, ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యామండలి నిర్ణయంతో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో వివాదం ఉండగా, ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడింది. ఈ వివాదంపై ఆగస్టు 4న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1988 చట్టాన్ని తెలంగాణకు అనునయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వివాదం నేపపథ్యంలో ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్టాల్ర మధ్య వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. విద్యుత్‌, నదీ జలాలు, ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సహా పలు అంశాలపై విభేదాలు ఏర్పడ్డాయి. అయితే, వీటిలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మినహా మిగతావన్నీ కేంద్ర జోక్యంతో పరిష్కారమయ్యాయి. కానీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వివాదమే రోజురోజుకి మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం, మరోవైపు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీచేయడం, టీ-సర్కారు సొంతంగా ఉన్నత విద్యామండలిని ఏర్పాటుచేయడంతో పరిస్థితి ఉత్కంఠకు దారితీసింది. ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకే బోధనా రుసుం చెల్లిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దుచేసి ‘ఫాస్ట్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. 1956కు ముందు స్థిరపడిన కుటుంబాలకు మాత్రమే లబ్ధిచేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకొంది. తాజాగా ఉన్నత విద్యామండలి ఏర్పాటుచేస్తూ జీవో జారీ చేసింది.