ఉన్నత విద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి
పేదలకు న్యాయవిద్య అందాలి
విశ్వవిద్యాలయాల్లో మరిన్ని పరిశోధనలు అవసరం
నల్సార్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. పేదలకు న్యాయవిద్య అందాలని, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ప్రోత్సహించాలని ఆయన కోరారు. నల్సార్ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సామాన్యులకు కూడా న్యాయవిద్య అందాలన్నారు. ప్రాథమిక హక్కులు అందరూ వినియోగించుకునేలా న్యాయవృత్తిలో ఉన్నవాళ్ళు చూడాలని సూచించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో నల్సార్ ఒకటని కొనియాడారు. నల్సార్‌లో కోర్పు పూర్తిచేసిన విద్యార్థులకు ఇవాళ మరిచిపోలేని రోజని అన్నారు.
నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘనస్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌సింగ్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉప ముఖ్యమంత్రి మహమద్ అలీ, ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, తారకరామారావు, పార్లమెంట్ సభ్యులు దత్తాత్రేయ, కవితలతోపాటు ఇరు రాష్ట్రాల డిజిపిలు, పలువురు అధికారులు, శాసనసభ్యులు విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.