మన బంధం బలమైంది
హిమాలయాలు-గంగానదంత పురాతనమైంది
బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పది
నేపాల్ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ
ఖాట్మండ్, ఆగస్టు 3 (జనంసాక్షి) : నేపాల్, భారత్ దేశాల బంధం బలమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధం హిమాలయాలు, గంగానది అంతటి పురాతనమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం నేపాల్ పార్లమెంట్‌నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ రాజధాని ఖాట్మండు వెళ్లారు. నేపాల్ పార్లమెంట్‌లో మొదటి అతిధిగా ప్రసంగించడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. నేపాల్ ఇచ్చిన గౌరవం భారత ప్రజలందరికీ చెందుతుందని అన్నారు. నేపాల్ ప్రజలు చాలా ధైర్యవంతులని, ఒక శక్తివంతమైన దేశంగా, హిమాలయాల స్థాయిలో నేపాల్ ఎదిగితే చూడాలనుకుంటున్నానని మోడీ తన అభిప్రాయం వ్యక్తంచేశారు. బుల్లెట్ కంటే కూడా బ్యాలెట్ గొప్పదని, రాజ్యాంగం అందరినీ కలుపుతుందే తప్ప విడదీయనని అన్నారు. ప్రజాస్వామ్య దేశాలన్నీ నేడు నేపాల్ వైపు దృష్టిసారించాయని అన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. భారత ప్రధాని నేపాల్‌ను సందర్శించడం గడిచిన 17 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. ప్రధాని మోడీకి ఖాట్మండు విమానాశ్రయంలో నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, మంత్రులు, భారత రాయబారి రంజిత్‌రావ్, ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్, ఇతర భారత సీనియర్ అధికారులు కూడా మోడికి స్వాగతం పలికారు. ప్రధాని మోడీ నేపాల్ సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రెండు దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఈ సందర్భంగా ఆలపించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపు గురించి నరేంద్ర మోడీ నేపాల్ ప్రధానితో చర్చించనున్నారు. ఈ పర్యటనలో మోడీ చిరకాల వాంఛ నెరవేరనున్నది. జనక్‌పూర్‌లోని రామజానకి మందిరాన్ని, లుంబినిలో బుద్ధ భగవానుడి జన్మస్థలాన్ని దర్శించాలన్న కోరికను ప్రధాని మోడీ వ్యక్తంచేశారు. అలాగే ప్రముఖ ఆలయం పశుపతినాథ మందిరాన్ని కూడా మోడీ దర్శించనున్నారు.