నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదు

1

మావోయిస్టు నేత ప్రచండతో మోడీ భేటీ

పశుపతి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని

ఖాట్మండు, అగస్టు4 (జనంసాక్షి) : నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నేపాల్‌ పర్యటనలో ఉన్న మోడీతో సోమవారం మావోయిస్టు నేత, నేపాల్‌ మాజీ ప్రధాని ప్రచండ భేటీ అయ్యారు. మోడీతో సమావేశం ఫలప్రదంగా ముగిసిందని, ఇరుదేశాల మధ్య శాంతి, నేపాల్‌ ఆర్థిక ప్రగతి పట్ల మోడీ చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉన్నారని ప్రచండ పేర్కొన్నారు. భారత ప్రధాని మోడీని నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌బరన్‌యాదవ్‌ ప్రసంశల వర్షంలో ముంచెత్తారు. ‘పార్లమెంటులో మీ ప్రసంగం మా హృదయాలను దోచుకుంది’ రామ్‌ బరన్‌ యాదవ్‌ మోడీతో అన్నారు. నేపాల్‌లో రెండో రోజు పర్యటనలో ఉన్న భారత ప్రధాని సోమవారం ఉదయం పశుపతినాథబిడిని దర్శించుకున్న అనంతరం ఆ దేశ అధ్యక్షుడిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ ప్రసంగం నేపాల్‌ ప్రజల హృదయాలను స్పృశించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే తమకు అండగా, సాయం అందించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోబోదని భారత ప్రధాని నరేంద్రమోడీ స్పష్టంచేశారు. సరిహద్దు అంటే అడ్డుకట్టగా కాకుండా ఇరు దేశాల నడుమ ఒక వారధిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. పొరుగు దేశాలతో దౌత్యపరమైన, ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్‌ భావిస్తోందనీ, ఆ క్రమంలో నేపాల్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటున్నామని చెప్పారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం నేపాల్‌ వచ్చిన మోడీ ఆదివారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. 1990 తర్వాత ఒక విదేశ నేత నేపాల్‌ పార్లమెంటులో ప్రసంగించడం ఇదే ప్రథమం. 125 కోట్ల మంది భారత ప్రజల ప్రేమాభిమానాలను తీసుకుని వచ్చానంటూ ప్రధాని నేపాలీలో ప్రసంగాన్ని ప్రారంభించడంతో సభ్యులంతా ఆనందంతో పెద్దపెట్టున బల్లలు చరిచారు. నేపాల్‌లో జాతీయ రహదారుల నిర్మాణంలో భారత్‌ సహకరిస్తుందని మోడీ చెప్పారు. ప్రపంచదేశాలతో అనుసంధానత కోసం, డిజిటల్‌ యుగంలో వెనుకబడిపోకుండా ఉండడం కోసం సమాచార హైవేలను అభివృద్ధి చేయడంలోనూ చేయూతను అందిస్తామని చెప్పారు. జల విద్యుత్తు రంగంలో నేపాల్‌కు అపారమైన అవకాశాలున్నాయనీ, భారత్‌ కూడా విద్యుత్తు కొనుగోలుకు సిద్ధంగా ఉందని చెప్పారు. కేవలం విద్యుత్తును అమ్ముకుని అభివృద్ధి చెందిన దేశంగా మారిపోవచ్చని చెప్పారు. పర్యాటక, వనమూలికల రంగంలోనూ నేపాల్‌కు మంచి అవకాశాలున్నాయనీ, వీటిల్లో భాగస్వామి అయ్యేందుకు భారత్‌ ఆసక్తితో ఉందని చెప్పారు. నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలాతో కలిసి మూడు ఒప్పందాలపై మోడీ సంతకాలు చేశారు.