గ్రౌండ్‌ రిపోర్టుతోనే పారదర్శకత

4

నేటి నుంచి కేసీఆర్‌ జిల్లాల పర్యటన

క్షేత్రస్థాయిలోనే ప్రణాళికలు సిద్ధంకావాలి

హైదరాబాద్‌, అగస్టు 4 (జనంసాక్షి) : గ్రౌండ్‌ రిపోర్టుతోనే పాలనలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు అన్నారు. తాను చేపట్టబోయే జిల్లాల పర్యటనకు అర్థం, పరమార్థం ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల ప్రస్తుత స్థితి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చిస్తానని ఆయన తెలిపారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మురుగు నీటి వ్యవస్థపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్‌ కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మౌలిక సదుపాయాలపై సీఎంకు ఆమె నివేదిక ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కరీంనగర్‌ జిల్లాలో, గురువారం నిజమాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆరెండు జిల్లాలో చేపట్టాల్సిన పనులు, పర్యటన ఏర్పాట్లను  ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సవిూక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కరీంనగర్‌  ఎంపి బి. వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మలతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సవిూక్షలో పాల్గొన్నారు. తన పర్యటనకు నిర్ణీత లక్ష్యాలు. అర్థం, పరమార్థం వుండాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల ప్రస్తుత స్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి సరిష్కార మార్టాలు తదితర అంశాలపై కూలంకశంగా చర్చిస్తానని అధికారులు కూడా పూర్తి వివరాలతో సమావేశాలకు రావాలని సూచించారు. ముఖ్య ప్రభుత్వ శాఖల రాష్ట్రస్థాయి ప్రధాన అధికారులతోపాటు ఎంపిడిఓ, తమశీల్దార్లు, కూడా ఈ సవిూక్షలో పాల్గొని జిల్లా సమగ్రాభివృద్ది కోసం సూచలను, సలహాలు, ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. జిల్లాలో మంచినీరు. విద్యుత్‌ ,రహదారులు, వైద్య ఆరోగ్యం, డ్రైనేజీ, వీధిలైట్లు , హౌసింగ్‌, డంప్‌యార్డులు, రింగ్‌ రోడ్డులు, మాస్టర్‌ ప్లాన్‌, బస్‌స్టేషన్లు, పార్కులు, పర్యాటకం, విద్య తదితర అంశాలపై పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. జిల్లాకు చెందిన ఎంపిపి, జడ్పిటిసీ , మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కవిూసనర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు ఈ సవిూక్షలో పాల్గొనాలని చెప్పారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాలలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా వుందని వాటిపై సత్వరందృష్టి పెట్టాలని కేసీఆర్‌ చెప్పారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటనకన్నా ఒకరోజు ముందే సిఎంఒ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ జిల్లాకు వెళ్లాలని కేసిఆర్‌ సూచించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలో, జిల్లా కేంద్రంలో చేయాల్సిన పనులనై స్మితాసబర్వాల్‌ క్షేత్ర పర్యటన జరిపి వాస్తవాలు సేకరిస్తారు. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన స్మితకు ఇక్కడి వాస్తవ పరిస్థితులు పూర్తిగా తెలుసు.  జిల్లా సవిూక్ష సందర్బంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్మితాసబర్వాల్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు కూడా సీఎం ఆదేశాలతో ఆయా జిల్లాలకు తరలివెళ్లనున్నారు. ఈనెల 5న కరీంనగర్‌ లో జరిగే సీఎం పర్యటన కోసం స్మితాసబర్వాల్‌ సోమవారమే కరీంనగర్‌ వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ తో పాటు ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. 5న ఉదయం కరీంనగర్‌ పట్టణంలో విస్త్రృతంగా పర్యటించి డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక సదుపాయల విషయంలో ప్రస్తుత స్థితిని , ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేస్తారు. సీఎంకు నివేదిక అందిస్తారు. స్మితాసబర్వాల్‌ తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్ర పర్యటనలతో పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ ప్రాణం పోసింది. 2001 సెప్టెంబర్‌ 17 అక్కడ నిర్వహించి సభ ఇవాళ తెలంగాణ సాధించి పెట్టిందని ముఖ్యమంత్రి చెప్పారు. కరీంనగర్‌ తో తనకు భావోద్వేగ అనుబంధం ఉన్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌ తో పాటు జిల్లా అభివృద్దికి పాటు పడాల్సిన బాధ్యత తనకు వుందని చెప్పారు. మంగళవారం జరిగే రివ్యూ సందర్బంగా అప్పటికప్పుడు కొన్ని అనుమతులు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లాకు వ్యవసాయ రగంలో బాగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. 7న జరిగే నిజామాబాద్‌ పర్యటనలో భాగంగా ఆర్మూర్‌, అంకాపూర్‌, నిజామాబాద్‌, పట్టణాలను సందర్శిస్తానని చెప్పారు. అంకాపూర్‌ గ్రామాన్ని దేశమంతా ఆదర్శంగా తీసుకుని వ్యవసాయ పాఠాలు నేర్చుకునే విధంగా తీర్చిదిద్దాలనేదీ తన తపన అని ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

నిజామాబాద్‌ నగరంలో అండర్‌ డ్రైనేజీ

వ్యవస్థను సరిచేయాల్సి వుందని, రింగ్‌ రోడ్డు నిర్మించాలని, ఓ ఆదర్శనగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి తన మనోగతాన్ని వెల్లడించారు. సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ ప్రతి కార్యక్రమాన్ని కరీంనగర్‌ నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు. అదే కోవలో రేపు కూడా కరీంనగర్‌ జిల్లా నుంచే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. సీఎంగా కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సిఎం ప్రజలకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంఓలనూ, ఎన్నికల సమయంలోనూ ఇచ్చిన హావిూల మేరకు కార్యాచరణ ఉంటుందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని సిఎం నిరూపించబోతున్నారని చెప్పారు.