కోతలు ఎత్తివేయండి

5

విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతుల ఆందోళన, పోలీసుల లాఠీఛార్జీ

మెదక్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి ) : విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ  తెలంగాణలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. గతకొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలకు తోడు సోమవారం వివిధ ప్రాంతాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి.  దీంతో ఆగ్రహించిన రైతులు మెదక్‌ జిల్లా నార్సింగ్‌లో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో 10 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు పోలీస్‌ వాహనాలపై రాళ్లు రువ్వారు. రామాయంపేట సీఐ గంగాధర్‌పై రైతులు దాడి చేశారు. జిల్లాలోని రాస్‌పల్లి, ఛండీ గ్రామాల సబ్‌ స్టేషన్ల ఎదుట కూడా రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు వరంగల్‌ జిల్లా రాయపర్తి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. నల్గొండ జిల్లా నూతనకల్‌, మిర్యాలగూడ సబ్‌ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. పంట పొలాలకు విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. విద్యుత్‌ కోతలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ నార్సింగి వద్ద 44వ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసులపై రైతులు కూడా తిరగబడ్డారు. పోలీసు వాహనంతో సహా రోడ్డుపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలపై రైతులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి.  మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో విద్యుత్‌ కోతలను నిరసిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. రైతుల ధర్నాతో 4 కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం లక్ష్మాపూర్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారు. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. నల్లగొండ జిల్లా నూతనకల్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. విద్యుత్‌ కోతలను తగ్గించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.