పరిశ్రమలకు కోత విధిస్తాం
అన్నదాతలను ఆదుకుంటాం
మహబూబ్‌నగర్, ఆగస్ట్ 5 (జనంసాక్షి) : అవసరమైతే వారానికి రెండు రోజులు పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించైనా అన్నదాతలకు కరెంట్ సరఫరా చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో విద్యుత్ అందిస్తామన్నారు. రైతులకు విద్యుత్ ఇవ్వడానికే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాథాన్యం ఇస్తుందన్నారు. వచ్చే ఖరీఫ్‌కు మహబూబ్‌నగర్‌లోని 5లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, ఆర్డీఎస్ పూర్తి చేస్తామన్నారు. వీటికి నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. జిల్లాలోని మానవపాడు మండలంలో మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌కు పాలమూరు జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఆయన చెప్పారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఆర్డీఎస్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని హావిూనిచ్చారు. ఆర్డీఎస్ ఎత్తును పెంచి పాలమూరు జిల్లాకు రావాల్సిన 15.9 టీఎంసీల నీళ్లను తీసుకోస్తామని చెప్పారు. అవసరమైతే పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పాటు కరెంట్ కోతలు విధిస్తామని తెలిపారు. రైతులకు పూర్తిస్థాయిలో విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. జిల్లాకు మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ ఆఫీస్ ను మంజూరు చేస్తామని ఆయన హావిూనిచ్చారు. అంతకుముందు మంత్రి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, చైర్మన్, ఈవో గురురాజాలు మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సంపత్‌కుమార్, గువ్వల బాలరాజు, లక్ష్మారెడ్డి, శశిథర్‌రెడ్డి, అంజయ్య, శ్రీనివాసుల గౌడ్, జడ్పీచైర్మన్ భాస్కర్, మాజీ ఎంపీ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చేరుకున్న మంత్రి హరీష్‌రావుకు నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి మందా శ్రీనాధ్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొల్లేరుకు చేరుకుని నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాధం స్వగ్రామమైన కొండేరుకు వెళ్లారు. అక్కడ అల్పాహారం సేవించి అమ్మవారి దర్శనానికి అలంపూర్ వెళ్లారు. ఆయనతో పాటు తెరాస ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలున్నారు. మానవపాడు మండలంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. మండలంలోని బొంకూరులో టీఆర్‌ఎస్ జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.