కీలక వడ్డీరేట్లు యథాతథం

2
2015నాటికి ద్రవ్యోల్భణం 8శాతానికి కట్టడికి కృషి

రెపోరేటులో మార్పులేదు : ఆర్‌బిఐ

ముంబై, ఆగస్టు 5 ( జనంసాక్షి) : కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. కీలక నిర్ణయాలకు భారత రిజర్వ్‌బ్యాంక్‌ సాహసించలేదు. 2015నాటికి ద్రవ్యోల్భణం 8శాతానికి కట్టడికి కృషిచేస్తామని ఆర్‌బిఐ పేర్కొంది. అందరి అంచనాలను నిజం చేస్తూ ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సవిూక్ష ముగిసింది. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఎస్‌ఎల్‌ఆర్‌ను 0.5 శాతం తగ్గించింది. 22.5 శాతంగా ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ను 22 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక వర్గాలకు, రుణగ్రహీతలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఊరటనివ్వలేదు. ఆర్‌బీఐ నిర్ణయం ఫలితంగా గృహ, వాహన లోన్లపై యథావిధిగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కీలక వడ్డీ రేట్లలో కేంద్ర బ్యాంకు మార్పులు చేయలేదు. రెపో రేటు, రివర్స్‌ రెపోరేటు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)లలో మార్పులు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2015 జనవరి నాటికి ద్రవ్యోల్బణాన్ని 8శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2016 నాటికి ఆరు శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వెల్లడించారు. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే, ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరపతి సవిూక్షలో పెద్దగా కీలక నిర్ణయాలు వెలువడకపోవడం స్టాక్‌మార్కెట్లపై ప్రభావం చూపింది. సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాలను మూటగట్టుకున్నాయి.