పార్లమెంట్‌ ఉభయ సభల్లో యుపిఎస్సీ రచ్చ

3

ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలుండాలి : విపక్షాల పట్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) : యూపీఎస్సీ వివాదం పార్లమెంట్‌ను మళ్లీ కుదిపేసింది. ప్రాంతీయ భాషల్లోనే పరీక్ష నిర్వహించాలనే డిమాండ్‌తో ఉభయ సభలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుమార్లు వాయిదా పడ్డాయి. యూపీఎస్సీ వివాదాన్ని రాజ్యసభ, లోక్‌సభలలో పలువురు ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమివ్వాలంటూ పట్టుబట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభను చైర్మన్‌ హవిూద్‌ అన్సారీ వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం విపక్షాల ఆందోళన కొనసాగింది. ప్రాంతీయ భాషల పట్ల వివక్షత తగదని తెలుగు, తమిళ ఎంపీలు రాజ్యసభలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాంతీయ భాషల్లోనే యూపీఎస్సీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని కోరారు. అందుకు సభాపతి అనుమతించలేదు. ముందుగా నోటీసు ఇవ్వకుండా చర్చ చేపట్టడం కుదరదని స్పష్టంచేశారు. దీంతో తెలుగు, తమిళ ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. అన్నా డీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. చైర్మన్‌ ఎంతగా చెప్పినా వారు శాంతించలేదు. దీంతో సభను మరోమారు వాయిదా వేశారు. సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీ-శాట్‌)లో ఇంగ్లీష్‌లో వచ్చే మార్కులను ప్రతిభకు ఆధారంగా తీసుకోబోమని కేంద్రం సోమవారం ప్రకటించింది. అయితే, ప్రాంతీయ భాషల్లోనే పరీక్ష నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అన్ని జాతీయ భాషల్లోనూ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఢిల్లీలో నిరసన చేపట్టారు.