సమన్వయంతో సాగుదాం

4
రెండు రాష్ట్రాల సభాపతుల నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : పరస్పరం సమన్వయంతో సాగుదామని రెండు రాష్ట్రాల సభాపతులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ భవనాల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణకు చెందిన స్పీకర్‌ మధుసూధనాచారి, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు వీరిద్దరు అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరురాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీలో ఎదురవుతున్న సమస్యలపై చర్చ జరుగుతున్నట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు, రెండు రాష్ట్రాల కార్యదర్శులు పాల్గొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎదురైన ఇబ్బందులు వీటన్నిటిని మరొక్కసారి పునఃసవిూక్షిస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ నెలాఖరులో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై ఈ భేటీలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.