లోక్‌సభ వెల్‌లోకి రాహుల్‌

1

ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక మతకలహాలు పెరిగాయి

చర్చకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ సభ్యులతో కలసి తొలిసారిగా రాహుల్‌ వెల్‌లోకి దూసుకుని వచ్చారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత కలహాలు పెరిగాయని కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా రాహుల్‌ కూడా వెల్‌లోకి రావడం విశేషం. సాధారణంగా పార్లమెంటులో వెనక బెంచీల్లో కూర్చునే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ  స్పీకర్‌ వెల్‌ వద్దకు దూసుకురావడం చర్చనీయాంశమైంది. సభాపతి పక్షపాతం వహిస్తున్నారని, విపక్షాలకు చర్చించే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఒకే ఒక్క వ్యక్తి తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదనే పద్ధతి కన్పిస్తోంది పార్లమెంట్లో.. అంటూ రాహుల్‌ పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మతపరమైన హింస గురించి చర్చకు అవకాశమివ్వాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కోరారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అందుకు అంగీకరించక పోవడంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఇటీవల జరిగిన మతహింస ఘటనలపై చర్చకు కాంగ్రెస్‌ ఎంపీలు పట్టుబట్టారు. ఆ మేరకు ఈ ఉదయం సభా పతికి వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. చర్చకు వీలు కల్పిస్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ప్రశ్నోత్తరాల రద్దుకు నిరాకరించడంతో కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనలకు దిగారు. వారి నినాదాల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. దీంతో కాంగ్రెస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా స్పీకర్‌ వెల్లలోకి చొచ్చుకెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాహుల్‌ ఆరోపించారు. కాగా ప్రశ్నోత్తరాల రద్దుకు స్పీకర్‌ నిరాకరిస్తూ సభను కొనసాగించడంతో కాంగ్రెస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దేశంలో మతకలహాల ఘటనలపై లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్‌ సభ్యులు పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి మతకలహాల ఘటనలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం ప్రశాతంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.