మా ఎంసెట్‌ మాదే

4
స్వతంత్రంగానే కౌన్సెలింగ్‌

అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 6(జనంసాక్షి) : స్వతంత్రంగానే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం అధికారులను ఆదేశించారు. కేసీఆర్‌ సమక్షంలో బుధవారం విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ, న్యాయశాఖ అధికారులతో కీలక సమావేశం జరిగింది, ఈ భేటీలో కేసీఆర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌, సుప్రీంకోర్టు తీర్పు అంశాలపై చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో తాము ఏం చేయబోతున్నది ఏపీ ఉన్నత విద్యామండలికి తెలియజేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్లుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, అలాగే ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి శైలజ రామయ్య ఇద్దరు కూడా ఏపీ ఉన్నతవిద్యామండలి సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు అయిందని దీనిని కో-ఆర్డినేట్‌ చూసుకుంటూ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే సహకరిస్తామని, లేకపోతే తెలంగాణ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ స్వతంత్రంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని, సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నామని, ఇంకా తుది తీర్పు రాలేదు కాబట్టి 11న తమకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఏపీ కౌన్సిల్‌ ముందు వినిపించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఈ ఉద్దేశంతోనే తెలంగాణ అధికారులు వికాస్‌ రాజ్‌, శైలజా రమయ్యలు ఏపీ ఉన్నత విద్యా మండలి సమావేశానికి హాజరయ్యారు.