మడమ తిప్పలేదు.. మాట మార్చలేదు
ఆయన ధ్యాస, శ్వాస తెలంగాణే
తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఆగస్ట్6 (జనంసాక్షి ) : ఇంటర్ విద్యార్థి దశ నుంచి ఉద్యమాన్ని ప్రారంభించి ఐదు దశాబ్ధాలకుపైగా ప్రొ.జయశంకర్ సార్ మడమ తిప్పని గొప్ప పోరాట యోధుడని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన వారిలో జయశంకర్ సార్ ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పోరాటంచేసిన యోధుడు, అధికారికంగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు సార్ లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా జయశంకర్ సార్ రాజీ పడలేదన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తి కోసం సార్ ఆహర్నిశలు శ్రమించారని తెలిపారు. తెలంగాణ దు:ఖం చూసి కన్నీరుమున్నీరయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ నినాదాన్ని అనుక్షణం సజీవంగా ఉంచేందుకు సార్ వేల కిలోవిూటర్లు ప్రయాణించి తెలంగాణ మొత్తం తిరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేత సత్యవతి రాథోడ్, మాణిక్ రెడ్డి తదితర పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జయశంకర్ జయంతి ఉత్సవాలను ప్రారంభించిన నాయిని
చర్లపల్లి పారిశ్రామికవాడలో ప్రొఫెసర్ జయశంకర్ 80వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశ్రామిక వేత్తల భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలను నాయిని ప్రారంభించారు. చర్లపల్లి పారిశ్రామిక వేత్తల సంఘం(సీఐఏ), తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం(టీఐఎఫ్), హైదరాబాద్ పారిశ్రామిక వేత్తల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.