కమలాబెణీవాల్‌ తొలగింపుపై దుమారం

1
రాజకీయ కక్ష సాధింపే : కాంగ్రెస్‌

నిబంధనల ప్రకారమే తొలగించాం : కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : మిజోరం గవర్నర్‌ కమలా బెణివాల్‌ తొలగింపుపై దుమారం నెలకొంది. ఆమెను తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్‌డిఎ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. అయితే, బెణివాల్‌ను తొలగించడంపై వస్తున్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రాజ్యాంగబద్దంగానే కమలా బెణివాల్‌పై చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టంచేసింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మిజోరం గవర్నర్‌ కమలా బెణివాల్‌ను మోడీ ప్రభుత్వం బుధవారం తొలగించింది. గుజరాత్‌ గవర్నర్‌గా పని చేసిన ఆమె అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. బెణివాల్‌ను ఇటీవలే గుజరాత్‌ నుంచి మిజోరం గవర్నర్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆమెను తొలగించింది. ఆమెను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని, రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం ఇదని కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వ చర్య ఉందని విమర్శించింది. అయితే, ఆ విమర్శలను వెంకయ్య తోసిపుచ్చారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన విూడియాతో మాట్లాడారు. బెణివాల్‌పై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని, అందుకే ఆమెను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మరోవైపు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. రాజ్యాంగ నిబంధలనకు లోబడే బెణివాల్‌ను తొలగించినట్లు తెలిపారు. ‘రాజ్యాంగ నిబంధనలను అనుసరించే గవర్నర్‌ పదవి నుంచి కమలా బెణివాల్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు’ అని చెప్పారు. ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువగా చెప్పాలంటే అది పార్లమెంట్‌ వేదికగానే ఉంటుందన్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్‌ మండిపడింది. బెణివాల్‌ను తొలగించాలనుకుంటే కొన్నిరోజుల క్రితమే ఆమెను మిజోరంకు ఎందుకు బదిలీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ ప్రశ్నించారు.