షెడ్యూల్‌ ప్రకారమే యుపిఎస్సీ

2
మార్పుకు విపక్షాల పట్టు

ససేమిరా అంటున్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : షెడ్యూల్‌ ప్రకారమే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఇంతకుముందు ప్రకటించిన తేదీనే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో ప్రకటించిన తేదీ ఆగస్టు 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చిచెప్పింది. యూపీఎస్సీ వివాదంపై విపక్షాలు లేవనెత్తిన ఆందోళనకు ఇకనైనా ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా యూపీఎస్సీ అర్హత పరీక్ష జరగడానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. ఈ సమస్యకు భవిష్యత్తులో తగిన పరిష్కారం కనుగోనేందుకు యత్నిస్తామని హావిూ ఇచ్చారు. ఈ మేరకు వెంకయ్య గురువారం రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష తేదీ గడువు పెంచే యోచనలో ప్రభుత్వం లేదని స్పష్టంచేశారు. ‘ఆగస్టు 24న యూపీఎస్సీ పరీక్ష జరగనుంది. ఇప్పుడు ఈ వివాదం సరికాదు. ఈ తాజా గందరగోళంతో విద్యార్థులను మరింత ఆందోళనలోకి నెట్టవద్దు’ అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రాత్రికి రాత్రి మార్పులు తీసుకురావడం అసాధ్యమని చెప్పారు. ఈ వివాదంపై పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలు, ఔత్సాహికులతో సంప్రదింపులు జరపున్నట్లు చెప్పారు. అంతకుముందు విపక్షాలు ఈ అంశంపై రాజ్యసభలో ఆందోళన నిర్వహించాయి. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశాయి. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. యూపీఎస్సీ పరీక్ష విధానంపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని గురువారం విపక్షాలు వాగ్వాదానికి దిగాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్య సభలో ఓ ప్రకటన చేశారు.