ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి భరోసా
హైదరాబాద్,ఆగస్ట్ 7 (జనంసాక్షి) : ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. తెలంగాణ విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన భరోసానిచ్చారు. అందరికీ ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. గురువారం నాడాయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి సమావేశమవుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అన్ని అంశాలు చర్చిస్తామని చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఎలాంటి ఆందోళన వద్దని ప్రకటించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసర ఆందోళన చెందవద్దన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిందే తెలంగాణ కోసమని, అలాంటప్పుడు తెలంగాణ పిల్లలకు ఎలాంటి నష్టం జరగదన్నారు.