తండాల్లో తమ రాజ్యం తెరాసతోనే సాధ్యమైంది : ఈటెల
హైదరాబాద్, ఆగస్టు 8 (జనంసాక్షి) : తండాల్లో స్థానిక ప్రజల అధికారం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గత నలభై ఏళ్ళుగా తమ తం డాలను తామే పాలించు కుంటామని కోరుతున్న గిరిజనుల కలలను ముఖ్య మంత్రి కేసీఆర్ నెరవేర్చారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవ మహాసభలకు ఆయన హాజరయ్యారు. భవిష్యత్‌లో గిరిజనుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామన్నారు. కేసీఆర్ మాటిస్తే తప్పే వ్యక్తి కాదన్నారు. తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యమంలో అనేక మంది గిరిజనులు పాల్గొన్నారని, గిరిజనుల పోరాట స్ఫూర్తిని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థి మాలోత్ పూర్ణను మంత్రి ఈటెల సన్మానించారు.