తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 8 (జనంసాక్షి) :
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిషన్ ఏర్పాటు తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 83(2) ప్రకారం కమిషన్ ఏర్పాటుకు జీవో జారీ చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ స్పష్టంచేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ నిన్న అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రతీ రాష్ట్రం సొంతంగా పబ్లిక్ సర్వీసు కమిషన్ కలిగి ఉండొచ్చని రాజ్యాంగంలోని 320వ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. టిఎస్‌పిఎస్‌సి ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైలుపై గురువారం ఆయన ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీకి, కొత్త నియామకాలు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లయింది. టిఎస్‌పిఎస్‌సి ఏర్పాటుకు ఆమోదం తెలపడానికి ముందు గవర్నర్ నరసింహన్ ఎపిపిఎస్‌సి ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకున్నారు. సాంకేతికపరమైన అంశాలన్నీ పూర్తిచేసిన తర్వాత గురువారం సాయంత్రం గవర్నర్ టిఎస్‌పిఎస్‌సి ఫైలుపై సంతకం చేశారు. టిఎస్‌పిఎస్‌సి ఏర్పాటుచేస్తూ జీఓ జారీచేయడాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఏసి ఛైర్మన్ దేవీ ప్రసాద్ స్వాగతించారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఆయన కృషి ఫలితంగానే ఇంత తొందరగా టిఎస్‌పిఎస్‌సి ఏర్పడుతున్నదన్నారు. దేవీ ప్రసాద్‌తోపాటు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు, నిరుద్యోగులు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తంచేశారు.