గవర్నర్‌ అధికారాల నిర్ణయంపై సర్వత్ర నిరసన

1

తెలంగాణ వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని సహించేదే లేదని తెలంగాణవాదులు తేల్చిచెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు,నిరసనలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్‌ అధికారాలను గవర్నర్‌కు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ తెలంగాణవాదులు ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దహనం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణవాదులు మోడీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓయూ, నిజాం కళాశాలలో టీఆర్‌ఎస్వీ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టిఆర్‌ఎస్వీ పిలుపునిచ్చింది. ఇదిలావుంటే రాష్ట్ర వ్యవహారాల్లో, ఉభయ కమిషనరేట్లతో పాటు రంగారెడ్డి జిల్లా శాంతి భద్రతల వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిన విషయంపై రాష్ట్ర సర్కరా/- మండిపడుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ పాలనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో గవర్నర్‌ అధికారాలు అమలు చేయడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. మంత్రుల సలహాలు, సంప్రదింపుల మేరకే గవర్నర్‌ పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. గవర్నర్‌కు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అప్పగించలేం.. రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం తగదని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమావేశమయ్యారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖపై సమావేశంలో చర్చించారు.