నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
అధికారంలోకొచ్చి 60రోజులే: మోడీ
న్యూఢిల్లీ, ఆగస్టు 9 (జనంసాక్షి):ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకొని తమకు అధికారం కట్టబెట్టారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా సవ్యదిశలో పయనిస్తోందని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలోని నిర్వహించిన బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ప్రభుత్వాన్ని సవ్యదిశలో నడపడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. పార్టీని నలుదిశలా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ విస్తరణ కోసం స్థాయితో సంబంధం లేకుండా కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని కోరారు. ఎన్నికల్లో భారీ విజయం కార్యకర్తలు, నాయకుల బాద్యతను మరింత పెంచిందని చెప్పారు. దేశాన్ని బాగు చేయగలననే నమ్మకం ఈ 60 రోజుల పాలనలో కలిగిందని మోడీ ధీమా వ్యక్తంచేశారు. ఒక్కో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. దేశంలోని యువతను ఈ దిశగా చైతన్యపరుస్తామని చెప్పారు. ఈ సవాళ్లన్నీ విజయవంతంగా పూర్తి చేస్తాననే నమ్మకం తనకుందన్నారు. భారత్ వంటి అతిపెద్ద దేశంలో కేవలం ప్రధాని పాత్రే కీలకం కాదని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు.
గతంలో తానెవరో ఢిల్లీ ప్రజలకు తెలియదని, కానీ 60 రోజుల్లోనే తానేంటో అందరికీ తెలిసిందన్నారు.
వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఓ పద్ధతిని నిర్దేశించుకోవడానికి ఈ 60 రోజులు సరిపోయాయని తెలిపారు. 60 ఏళ్ల పాటు ఏవిూ చేయని కాంగ్రెస్ ఈ 60 రోజుల్లో ఏం చేశారని తమని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని మోడీ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్వహణలో పార్టీ జాతీయ అధ్యక్షుడి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ విభిన్నమని తెలిపారు. పార్టీ ప్రతి ఏటా ఒక్కో సామాజిక కార్యక్రమాన్ని చేపట్టాలని మోడీ సూచించారు. ఒక సంవత్సరం విద్యుత్ పొదుపు గురించి అయితే, మరో సంవత్సరం బాలికల విద్య వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. అన్ని అడ్డంకులను అధిగమించి అధికారంలోకి వచ్చామని చెప్పారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌ను నిశితంగా గమనిస్తున్నాయని, ఎందుకుంటే సొంతంగా మెజార్టీలోకి వచ్చామని తెలిపారు. భారత్ పట్ల ప్రపంచ దేశాలు సానుకూలతతో ఉన్నాయని తెలిపారు.
ప్రజల మద్దతుతోనే అధికారం వచ్చిందని, వారి ఆశయాలను నెరవేరుస్తామన్నారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారని, వారికి ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. బాధ్యతలు
స్వీకరించి 60 రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రజల ఆశలను కచ్చితంగా నెరవేర్చగలమని హావిూ ఇవ్వగలనన్నారు. తాము అధికారం చేపట్టినప్పటి నుంచి ఎక్కువ సమయం పని సంస్కృతిలో మార్పు తెచ్చేందుకే సరిపోయిందన్నారు. 300 సీట్లకు పైగా గెలుస్తామని ఎన్నికలకు ముందు తాను ప్రకటిస్తే.. నెంబర్లు ప్రస్తావించొద్దని పార్టీ కోరిందని మోడీ చెప్పారు. కానీ తనకు ప్రజలపై పూర్తి నమ్మకముందని, ఆ మేరకు సీట్లు ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారని తెలుసన్నారు. ఎన్నికల సమయంలో రాజ్‌నాథ్‌సింగ్ బీజేపీ జట్టుకు కెప్టెన్‌లా వ్యవహరించారని.. అఖండ విజయంతో అమిత్ షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారని ప్రశంసించారు. అమిత్ షా లేకుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవి కావని తెలిపారు. ఈ సందర్భంగా షాకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కార్యకర్తలు పార్టీ విజయం కోసం అవిరళ కృషి చేశారని ప్రశంసించారు. దేశ ప్రజలకు మోడీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.