పెట్టుబడులకు తెలంగాణే సేఫ్
జహీరాబాద్‌లో రూ.300 కోట్లతో దృవ్ ట్రాక్టర్ల తయారీయూనిట్
బ్యాటరీతో నడిచే వాహనాలు వస్తే ప్రోత్సహిస్తాం
సీఎం కేసీఆర్‌తో మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ప్రతినిధుల భేటీ
పెట్టుబడులకు తెలంగాణా రాష్ట్రంమే సేఫ్ అని ప్రోత్సహించే పన్నుల విధానం, పారిశ్రామిక అనుమతులుంటాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. సచివాలయంలో శనివారం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. జహీరాబాద్‌లో రూ.300 కోట్ల వ్యయంతో దృవ్ ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు కంపేనీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వంతో కలిసి తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి తమ కంపెనీ కృషి చేస్తామని వెల్లడించారు. మెట్రో రైలు ప్రయాణీకులను రైల్వే స్టేషన్ల నుంచి తీసుకెళ్లి, తీసుకురావడానికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం ప్రిక్ అండ్ డ్రాప్) ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని, అదే సందర్భంలో నగరంలో కాలుష్యాన్ని కనిష్టస్థాయికి తేవాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణమైన ప్రణాళికలతో కంపెనీలు ముందుకు వస్తే ప్రభుత్వం కూడా తగినంత సహకారం అందిస్తుందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా హైదరాబాద్ నగరంలో కూడా బ్యాటరీతో నడిచే వాహనాలు రావాలని కోరారు. పెట్రోల్ బంకుల మాదిరిగానే బ్యాటరీ రీచార్జి స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కంపెనీలు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి సహకరం అందిస్తామన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రంలోని పలు చోట్ల ఇండస్ట్రీయల్ పార్కులు అభివృద్ది చేస్తున్నామని, ఇందులో ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఆర్ధికాభివృద్ధి, యువతకు ఉపాధి అనే రెండు లక్ష్యాలు తమకున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేందుకు చుట్టుపక్కల రాష్ట్రాల కంటే తక్కువ పన్నులే తెలంగాణలో ఉంటాయని వెల్లడించారు. కంపెనీలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ కార్యక్రమాలను కూడా ఎక్కువ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇంజనీరింగ్, ఐటిఐ లాంటి విద్యాసంస్థలను పరిశ్రమలకు అనుసంధానం చేసే ఆలోచన కూడా ఉందని, దీనివల్ల విద్యార్ధులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యం కూడా పెంచుకుంటారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సమావేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా సిఓఓ ప్రవీణ్ షా, సీనియర్ వైస్ ప్రసిడెంట్ విజయ్ కలవ, ఫైనాన్స్ చీఫ్ భరత్, అవ్వయిజర్ వెంకటరమణ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.