ఆదివాసీల హక్కులపై గవర్నర్‌ మాట్లాడాలి

4
టీ రాజకీయ ఐకాస చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మించి సీమాంధ్ర సర్కారు  ఆదివాసీల హక్కులను హరిస్తున్నా, గవర్నర్‌ పట్టించుకోవడం లేదని ఫలితంగా వారు అన్ని రంగాల్లో తీవ్ర వెనుకబాటుకు గురవుతున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు. ఈ అంశంపై గవర్నర్‌ మాట్లాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఆదివాసీలకు స్వయంపాలన కలిగించాలన్నారు. షెడ్యూల్‌5, 6 కింద కల్పించిన అధికారాలను అమలు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దుచేయాలన్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాలు నీట మునగడమే గాకుండా వారి అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అడవులపై ఆదివాసులకే హక్కు కల్పించాలన్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు పాలన వ్యవహారాలకు సంబంధించి గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్టాల్ర హక్కులపై కేంద్రం పెత్తనం చేయడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గిరిజన సంఘాల నేతలు బంగ్లా బూక్యా, శ్రీరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే

అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో బంజారా భేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌, మధుసూదనాచారి, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారులను ఈ సందర్భంగా అందరూ స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కుల సాధనకు కృషి చేస్తామని నేతలు హావిూ ఇచ్చారు.