తెలంగాణ హరితహారం కావాలి

5

పర్యావరణ పరిరక్షణ ఓ సంస్కృతిగా మారాలి

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి):

తెలంగాణ హరిత హరం కావాలని, పర్యావరణ పరిరక్షణ ఓ సంస్కృతిగా మారాలనిముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షించారు. తలెంగాణలో మొక్కల పెంపకం, ఫారెస్టు కాలేజీ ఏర్పాటు, హర్టికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రి శనివారం సచావాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారుడు బివి పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ప్రిన్సిపుల్‌ సిఎఫ్‌ ఎస్‌.బి.ఎల్‌. మిశ్రా, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, సిల్వికల్చరిస్ట్‌ ప్రియాంక వర్గీస్‌, మెదక్‌ డిఎఫ్‌ఓ సోనిబాల తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

పారిశ్రామికీకరణ అనివార్యమైన పరిస్థితుల్లో ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంటుందని చెప్పారు. కరువు కాటకాలకు, వర్షాభావ పరిస్థితులకు చాలినంత అడవి లేకపోవడమే కారణమనే అవగాహన ప్రజల్లో రావాలని సిఎం కోరారు. దట్టమైన అడవులున్న ప్రాంతాల్లోనే వర్షపాతం ఎక్కువుంటుందన్నారు. తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ ఎక్కువ ఉండేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే తెలంగాణకు హరిత హారం అనే పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో  అడవులకు సంబంధించిన విద్యను అందించడం కోసం ఫారెస్టు  కాలేజీని నెలకొల్పుతామని సిఎం ప్రకటించారు. తమిళనాడులోని మెట్టుపాలెం వద్ద ఫారెస్టు కాలేజీ ఉందనీ, అందులో చదివిన చాలా మంది విద్యార్ధులు ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారన్నారు. అలాంటి ఫారెస్టు కాలేజిని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి  అనుబంధంగా తెలంగాణలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో ఇందుకు అనువైన స్థలాన్ని ఇప్పటికీ పరిశీలించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఫారెస్టు కాలేజీ ఇక్కడ నెలకొల్పడం వల్ల మొక్కల పెంపకం, అడవుల రక్షణ, అటవీ ఉత్పత్తులపై అవగాహన, వివిధ రకాల చెట్లపై విజ్ఞానం పెరుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఉద్యానవన యూనివర్సిటీకి అనువైన స్థలాన్ని కూడా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.