నేతాజీ, వాజ్‌పేయికి భారతరత్న
పురస్కారం వద్దు.. మిస్టరీ ఛేదించండి
నేతాజీ కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (జనంసాక్షి) : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను భాజపా అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లకు ప్రదానం చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదిలా ఉండగా పురస్కారం అవసరంలేదని నేతాజీ హత్య మిస్టరీని ముందు ఛేదించండని ఆయన కుటుంబీకులు కోరుతున్నారు. 5 భారతరత్న పతకాలను సిద్ధం చేయాల్సిందిగా ¬ంమంత్రిత్వ శాఖ ప్రభుత్వ ముద్రణశాలను పురమాయించడం ఇందుకు కారణం. భారతరత్న కోసం స్వయానా ప్రధానమంత్రే రాష్ట్రపతికి పేర్లను సిఫార్సు చేయాల్సి ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ పేర్లను వెల్లడించవచ్చని భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్‌పేయితోపాటు స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వనున్నట్టు
వస్తున్న వార్తలపై బోస్ బంధువులు స్పందించారు. నేతాజీకి భారతరత్న అవార్డు అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు తాము మొదట్నుంచి వ్యతిరేకమని, బంధువుల్లో అత్యధికమంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని బోస్ మునిమనవడు చంద్రకుమార్‌బోస్ అన్నారు. నేతాజీ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని, ఇదే తాము కోరుకుంటున్నామని చెప్పారు.