చెన్నైలో ఎబోలా భూతం
ఆస్పత్రిలో చేరిన దక్షిణాఫ్రికా యువకుడు
చెన్నై, ఆగస్టు 10 (జనంసాక్షి) : ప్రస్తుతం ఆఫ్రికా దేశాలలో వందల మంది ప్రాణాలను బలితీసుకుంటూ, అమెరికా వంటి దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ భయం ఇప్పుడు చెన్నైను పట్టుకుంది. ఎబోలా వైరస్ వ్యాపించిన దేశాల నుంచి ఎవరైనా వస్తున్నారంటే చాలు అన్ని దేశాల వారు భయపడుతున్నారు. అలాగే ఆదివారం ఆఫ్రికా నుంచి 26 ఏళ్ల యువ ప్రయాణికుడు చెన్నై వచ్చారు. ఇంకేముందు అతనికి ఎబోలా వైరస్ సోకిందని అనుమానించారు. గినియా దేశం నుంచి ఆ యువకుడు వచ్చారు. వెంటనే అతనిని అత్యవసర వైద్య పరీక్షల కోసం చెన్నైలోని రాజీవ్‌గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతనికి ఎటువంటి వైరస్ సోకలేదని నిర్ధారించారు. ఎబోలా వైరస్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు చేశామని, ఎబోలాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు అతనికి లేవని డాక్టర్ రఘునందన్ చెప్పారు. దాంతో ఇక్కడి అధికారులు
ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ప్రస్తుతమున్న మందులు లేని పలు జబ్బులతో బతుకీడుస్తున్న ప్రజలు ఈ వైరస్ గురించి భయాందోళనకు గురవుతున్నారు.