టెహ్రాన్‌లో కూలిన ఇరాన్ విమానం
48మంది మృతి
టెహ్రాన్, ఆగస్టు 10 (జనంసాక్షి) : మలేసియా విమాన దుర్ఘటన మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ పౌర విమానం ఒకటి ఆదివారం కూలిపోయింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం ఈ ఉదయం 9.18 నిమిషాలకు కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. విమానం దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్‌లోని టబాస్ నగరానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులతోపాటు 8మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విమానం టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం ఏర్పడడంతో ఘటన చోటుచేసుకుంది. శకలాల కోసం గాలింపు జరుపుతున్నారు.