కుట్ర @ నాయుళ్లు

4
మా ప్రశ్నలకు బదులివ్వు

బాబుకు హరీశ్‌ 10 ప్రశ్నల బహిరంగ లేఖ
హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి కుట్రపన్ని తెలంగాణపై ఆంక్షలు పెడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన 10 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు రావాలసిన 710 మెగావాట్ల విద్యుత్‌ను పీపీఏ రద్దు ద్వారా చంద్రబాబు అడ్డుకున్నారని ఆ లేఖలో విమర్శించారు. చంద్రబాబు తీరు దొంగే దొంగా.. దొంగా అని అరచినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో కయ్యాలు పెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని హరీష్‌రావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కంటే తెలంగాణపై విషం కక్కేందుకే చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. విద్వేషాలను రెచ్చగొడుతూ పైకి మాత్రం నీతి సూత్రాలు వల్లిస్తున్నారని విమర్శించారు. బిర్లా, మహేంద్ర, విప్రో, టాటా లాంటి కంపెనీలు తమ దగ్గరకు వస్తుంటే హైదరాబాద్‌లో గోకుల్‌ ఛాట్‌, లుంబినీ పార్క్‌లో బాంబులు పేలాయని… పాత విజువల్స్‌ పారిశ్రామికవేత్తలకు చూపించి తెలంగాణ వైపు పారిశ్రామికవేత్తలను రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కరెంట్‌ లేదని కూడా చెప్పారని హరీష్‌రావు ఆ లేఖలో వెల్లడించారు. ఇందులో బాబుకు పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో అభివృద్ధిని చంద్రబాబే అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాదు పైన గవర్నర్‌కు అధికారులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతున్నారని విమర్శించారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణపైన ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. పది ప్రశ్నలు: చంద్రబాబుపై హరీశ్‌రావు సంచలనం తెలంగాణకు రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్‌ను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, పారిశ్రామికవేత్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదులో ఆక్రణదారులకు చంద్రబాబు మద్దతుగా నిలుస్తున్నారని, అది ఎంతవరకు సమంజసం అన్నారు. నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ అకాడవిూ డైరెక్టర్‌ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీజేపీ నేత, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.