బెదిరింపులకు భయపడం

1

ఛానెళ్లను పునరుద్ధరించం

తెలంగాణ ప్రజలే మాకు సుప్రీం : ఎంఎస్‌ఓలు

హైదరాబాద్‌, ఆగష్టు11(జనంసాక్షి) : తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఛానళ్లపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఎంఎస్‌ఓలు ప్రశ్నించారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు. బెదరింపులకు భయపడి ఆ రెండు ఛానళ్లను ప్రసారం చేయబోమన్నారు. ప్రభుత్వాలు బెదిరిస్తే తాము భయపడబోమని తెలంగాణ ఎంఎస్‌వోలు స్పష్టంచేశారు.  ఎంఎస్‌వో ప్రతినిధులు మాధాపూర్‌లో సమావేశమై మొన్న పార్లమెంట్‌లో జరిగిన అంశాలపై చర్చించారు. తాము బెదిరిస్తే భయపడి ఛానెళ్లను ప్రసారం చేయమని తేల్చి చెప్పారు. ప్రజలకు ఇష్టమైన ఛానెళ్లనే ప్రసారం చేస్తామని, వాళ్లకు ఇష్టంలేని ఛానెళ్లను ప్రసారం చేయమన్నారు. ఇందు కోసం దేనికైనా సరే, ఎంతకైనా సరే తెగిస్తామన్నారు. ఛానళ్లలో ఆంధ్రా పెత్తనం ఎక్కువై పోయిందని దుయ్యబట్టారు. కొన్ని విషయాల్లో ఆంధ్రా ఛానెళ్లు సహకరించడంలేదని విమర్శించారు. తెలంగాణలో ఆ రెండు ఛానెళ్ల ప్రసారాలను ఎందుకు నిలిపివేశామో ఇక్కడి ప్రజలకు తెలియాలని ఎంఎస్‌వో ప్రతినిధులు మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకే ఆ రెండు ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసిన విషయం ప్రజలకు అర్థం కావాలన్నారు. కేబుల్‌ టీవీ యాక్ట్‌ సెక్షన్‌ 19, శాసన సభ తీర్మానం ప్రకారం కేంద్రం ఎందుకు ఆ రెండు ఛానెళ్లపై చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. నచ్చిన ఛానెళ్లనే ప్రసారం చేసే డీటీహెచ్‌ విూద లేని ఒత్తిడి మాపైనే ఎందుకని నిలదీశారు. ఎనలాగ్‌ సిస్టం వల్ల తాము 105 ఛానెళ్లకు మించి ప్రసారం చేయలేకపోతున్నామని వెల్లడించారు. సన్‌గ్రూప్‌ పెంచిన రేట్లు తగ్గించాలని కోరారు. లేకుంటే తాము వచ్చే నెలలో బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని వివరించారు.