తెలంగాణకు విద్యుత్‌ మేమిస్తాం

4

సంసిద్ధత వ్యక్తం చేసిన ఆదానీ గ్రూప్‌

ముఖ్యంమంత్రి కేసీఆర్‌తో ఆదానీ చర్చలు

హైదరాబాద్‌, ఆగస్ట్‌11 (జనంసాక్షి) : ఆదానీ గ్రూపు ద్వారా తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసి ఆదుకుంటామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ హావిూ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన సోమవారం సచివాలయంలో కలిసి చర్చించారు. గౌతం అదానీ ఈ టేటీలో 2020 వరకు మరో 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్‌కు హావిూనిచ్చినట్లు సమాచారం. ఆదానీ గ్రూపు వివిధ రంగాల్లో విస్తరించి ఉంది. సిఎంతో చర్చల సందర్భంగా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు సింగిల్‌ విండో విధానం ప్రకటించిందని ఆదానీకి సిఎం వివరించారు. త్వరలోనే దీనిపై సమగ్రమైన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామన్నారు. తెలంగాణ కూడా విద్యుత్‌ సంక్షోభంలో ఉందన్నారు. విద్యుత్‌ కొనుగోలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని కూడా అన్నారు. ఈ భేటీలో సిఎం రాజీవ్‌ శర్మ, స్పెషల్‌ సెక్రటరీ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే  సచివాలయంలో విద్యుత్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్‌ రాజీవ్‌ శర్మ, ట్రాన్స్‌కో అండ్‌ జెన్‌కో ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో విద్యుత్‌ కోతలు, ఇతర రాష్టాల్ర నుంచి విద్యుత్‌ కొనుగోలు అంశాలపై చర్చించారు. మరోవైపు దళితులకు పంపిణీ చేయడానికి భూమి కొనుగోలు చేసే నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 140 కోట్లు మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం రూ. 2.96 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.