తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

5
గవర్నర్‌ అధికారాలపై నిరసన

దళితుల భూ పంపిణీకి ఆమోదం

గోల్కొండ కోటపై పంద్రాగస్టు

ఎంసెట్‌ అడ్మిషన్లపై సుప్రీం తీర్పుకు అనుగుణంగా చర్యలు

రూ.480.42కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : గవర్నర్‌ అధికారాలపై తెలంగాణ కేబినెట్‌ నిరసన వ్యక్తంచేసింది. సోమవారం సమావేశమైన కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దళితుల భూ పంపిణీకి ఆమోద ముద్ర వేసింది. గోల్కొండ కోటపై పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని తీర్మానించింది ఎంసెట్‌ అడ్మిషన్లపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రూ.480.42కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేస్తూ తీర్మానం చేసింది. భూ పంపిణీ పథకానికి ముహుర్తం ఖరారైంది. ఈమేరకు పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 15న నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం పల్లెపాడులో భూపంపిణీ కార్యక్రమాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఇందు కోసం భూమి కొనుగోలు చేయడానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దళితులకు పంపిణీ చేయడానికి భూమి కొనుగోలు చేసే నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లు మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం రూ. 2.96 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.  రైతులకు రూ. 480 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 2009 నుంచి 2014 వరకు విపత్తులతో నష్టపోయిన రైతులకు ఈ ఇన్‌పుట్‌ సబ్సిడీ లభిస్తుంది. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు మరో రూ. 75కోట్ల నష్టపరిహారం అందించనున్నారు.