మోడీ అధికారంలోకి వచ్చాకే మతఘర్షణలు
సోనియా ధ్వజం
తిరువనంతపురం, ఆగస్టు 12 (జనంసాక్షి) : మోడీ అధికారంలోకి వచ్చాకే దేశంలో మతఘర్షణలు పెరిగిపోయాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. 70రోజుల్లో 600 మతఘర్షణలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. మంగళవారం కేరళ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో సోనియా ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే మత ఘర్షణలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో చాలా మత ఘర్షణలు జరుగుతన్నాయని చెప్పారు. ‘దేశంలో, ప్రత్యేకించి కొన్ని రాష్టాల్ల్రో ఇటీవల మత ఘర్షణలు ఎక్కువయ్యాయి. అది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే’ అని మండిపడ్డారు. మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చేందుకు విచ్ఛిన్నకర శక్తులు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. మత ఘర్షణలను నిర్మూలించేందుకు యూపీఏ హయాంలో తీవ్రంగా కృషిచేశామని చెప్పారు. విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. గాజా అంశంపైనా మోడీ సర్కారుపై సోనియా మండిపడ్డారు. లోక్‌సభలో చర్చకు పట్టుబట్టేందుకు తమకు సరైన బలం లేదని, రాజ్యసభలో మాత్రమే ఉందన్నారు. తాము పాలస్తీనియన్లకు మొదటి నుంచి సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ దేశంలో మత ఘర్షణలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో మత కల్లోలాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘర్షణలు కృత్రిమంగా సృష్టించినవేనని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఇటీవల లోక్‌సభలో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఓటమిని జీర్ణించుకోలేకే ప్రభుత్వంపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. సోనియా ఆరోపణలు నిరాధారమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.