పంద్రాగస్టునకు గోల్కొండ ముస్తాబు

2

ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 12 (జనంసాక్షి) : పంద్రాగటస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ప్రతి ఏడాది పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ వేడుకలను ఈసారి గోల్కొండ కోటకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ భద్రత సహా అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. గతానికి భిన్నంగా ఇక్కడ వేడుకలు నిర్వహించబోతున్నారు. మరోవైపు గోల్కొండ కోటలో పంద్రాగష్టు వేడుకలకు హాజరయ్యే వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం వీఐపీలతో పాటు అయిదువేల మందికి పాసులు ఇస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు గోల్కొండ కోట వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోట చుట్టూ 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేడుకల భద్రతా ఏరాట్లను మహేందర్‌ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న స్వాతంత్య్ర దిన వేడుకలు గతంలో కంటే భిన్నంగా జరుగనున్నాయి. యూనిఫాం సర్వీసుల కవాతు.. వివిధ శాఖల శకటాలు వంటివేవిూ లేకుండా ప్రభుత్వం సాధారణంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలను పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించగా తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఈ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. పంద్రాగస్టు వేడుకల్లో సీఎం గౌరవ వందనం (గార్డ్‌ ఆఫ్‌ హానర్‌) మాత్రమే స్వీకరిస్తారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన తరువాత సీఎం వేడుకలకు వచ్చిన అతిథులతో కరచాలనం చేస్తూ పలకరిస్తారు.