పాక్‌ది దొంగదెబ్బ
సియాచిన్‌పై రాజీలేదు
అవినీతే దేశాన్ని నాశనం చేసింది
ప్రధాని నరేంద్ర మోడీ
శ్రీనగర్, ఆగస్ట్ 12 (జనంసాక్షి) : పాక్‌ది దొంగదెబ్బ అని, సియాచిన్ విషయంలో ఎలాంటి రాజీపడబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పస్టంచేశారు. మోదీ ఒక్కరోజు కశ్మీర్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. అవినీతే దేశాన్ని నాశనం చేసిందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత మోదీ రెండోసారి మంగళవారం జమ్మూ-కశ్మీర్ పర్యటనకు వచ్చారు. ఈ ఏడాది ఆఖరులో ఎన్నికలు జరుగుతున్న కశ్మీర్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్గిల్ వచ్చిన ప్రధాని మోదీ లేహ్‌లో ఆర్మీ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలను కొనియాడారు. అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌పై ఎలాంటి రాజీ ఉండబోదని, అది ముమ్మూటికి మన భూభాగమేనని ఆయన అన్నారు. సియాచిన్‌పై రాజీపడే ప్రసక్తేలేదని మోదీ స్పష్టం చేస్తూనే పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి దిగిందని దీనికి ధీటుగా జవాబు ఇస్తామని ఆయన అన్నారు. లేహ్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు సూత్రాలను ప్రతిపాదించారు. కశ్మీర్ అభివృద్ధికి కేంద్ర, రాష్టాల్రు కలిసి పనిచేస్తాయని ఆయన హావిూ ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. 349 కిలోవిూటర్లు పొడవు ఉండే లేహ్, కార్గిల్, శ్రీనగర్ ట్రాన్స్‌మిషన్ లైన్‌కు మోదీ శంఖుస్థాపన చేశారు. 10 అడుగుల ఎత్తున మంచుకొండల్లో దీనిని నిర్మించనున్నారు. కార్గిల్ ప్రాంతంలో ప్రజల విద్యుత్ కష్టాలు తీర్చేందుకు ఈ ట్రాన్స్‌మిషన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. 44 మెగావాట్ల సుతాక్ పవర్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. లేహ్ ప్రజలు ఎంతో సహసవంతులని ఆయన ప్రశంసించారు. ఇకపై నెలకు రెండు సార్లు కశ్మీర్ వస్తానని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా లేహ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మంగళవారం మాట్లాడుతూ లేహ్, లద్దాక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రకాశ్, పర్యావరణ్, పర్యాటన్ మా మూడు సూత్రాలు అని ఆయన తెలిపారు. ఈ మూడు… అంటే విద్యుత్ పర్యావరణం, పర్యాటకం శక్తిమంతమైన మాధ్యమాలుగా అభివర్ణించారు. అవి లేహ్, లద్దాక్‌ను మాత్రమే కాదని కేవలం కశ్మీర్‌ను మాత్రమే కాదని…ఈ మూడు అంశాలపై దృష్టి పెడితే దేశాభివృద్ధి కూడా సాధ్యమని, వీటి సద్వినియోగం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లో ఈ ఏడాది మొత్తం 83 ప్రాజెక్టులు ప్రారంభించినట్లు మోదీ గుర్తుచేశారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. టైగర్ హిల్స్‌లో భారత విజయ పతాకం ఎగరడానికి కర్గిల్ ప్రజల ధైర్య సాహసాలే కారణమని భారత ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. తొలిసారిగా కర్గిల్ వచ్చిన ఆయన మంగళవారం మధ్యాహ్నం ప్రజలనుద్దేశించి బహిరంగసభలో ప్రసంగించారు. జమ్మూ-కశ్మీర్‌లో 20శాతం మందికిపైగా పేదలే ఉన్నారని, వారందరి అభివృద్ధి తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రాణాలకు తెగించి శత్రుమూకలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను కూడా ఆయన అభినందించారు. ఇక్కడ ప్రజలు చూపిన ఆదరాభిమానాలకు తప్పకుండా రుణం తీర్చుకుంటానని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఆయన అన్నారు. అవినీతి అనే మహమ్మారి దేశాన్ని పాడుచేసిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. లేహ్‌లోని పోలో మైదానంలో జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ అవినీతి దేశాన్ని పట్టిపీడిస్తోందని చెప్పారు. మనమంతా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అవినీతిపై పోరాటం చేసేవారికి అండగా నిలుస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీల నేతలు, అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కాశ్మీర్‌లో ఉగ్రదాదుల దాడి
కశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బీఎస్‌ఎప్ కాన్వాయ్‌పై దాడిచేసి ఏడుగురు జవాన్లను గాయపరిచారు. శ్రీనగర్ సవిూపంలో పాంపోర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రయాణించే వాహనం పహల్గా నుంచి శ్రీనగర్ వెళ్తుండగా అకస్మాత్తుగా ఉగ్రవాదులు దాడి చేసి… కాల్పులు జరిపారు. గాయపడిన జవాన్లను సవిూప ఆస్పత్రిలో చేర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ పర్యటనకు ముందు ఈ దాడి జరిగడం విశేషం.