పంద్రాగస్టు కానుక తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంటు

5
హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులకు పంద్రాగస్టు కానుకగా స్పెషల్‌ ఇంక్రిమెంటు అందనుంది. ఆగస్టు నెల వేతనంతోపాటు ప్రత్యేక ఇంక్రిమెంట్‌ అందుకోనున్నారు. ఈ మేరకు ఇంక్రిమెంట్‌ దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం సంతకం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇస్తామని ఎన్నికలకు ముందే కేసీఆర్‌ ప్రకటించారు. అధికారం చేపట్టిన తర్వాత తన హావిూని నిలబెట్టుకుంటానని పలుమార్లు పునరుద్ఘాటించారు. ఆ హావిూకి కట్టుబడి మంగళవారం ఇంక్రిమెంట్‌ దస్త్రంపై సంతకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ధర్నాలు, రాస్తారోకోలు, విధుల బహిష్కరణ సహా అన్ని పోరాటాల్లో ముందున్నారు. సకల జనుల సమ్మె ఉద్యోగుల పోరాటానికి నిదర్శనం. 42 రోజుల పాటు విధులకు దూరంగా ఉండి తెలంగాణ ఆకాంక్షను చాటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు సహా అందరూ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. వారి పోరాటం వల్లే కేంద్రంపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సుముఖత తెలిపి ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పోరాటాన్ని కీలకంగా అభివర్ణించిన కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ వేతనాలతో సమానంగా వేతనాలు ఇస్తామని హావిూ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఆయా హావిూలపై సీఎం దృష్టి సారించారు. అందుకు సంబంధించిన దస్త్రాల రూపకల్పనపై స్వయంగా పర్యవేక్షించారు. ఇచ్చిన హావిూకి కట్టుబడి మంగళవారం సదరు దస్త్రంపై సంతకం చేశారు. దీంతో ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులు ఇంక్రిమెంట్‌ అందుకోనున్నారు. ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌ అందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.