గడువుకు ముందే ఉద్యోగుల విభజన

3

అందరికి ఆమోదయోగ్యంగానే పంపిణీ

రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : గడువుకు ముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు   ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందరికి ఆమోదయోగ్యంగా, పారదర్శకంగా ఉద్యోగుల పంపిణీ ఉంటుందని గురువారం రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌ తెలిపారు. అందుకే ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలిపింది. రెండు రాష్టాల్ర ఏకాభిప్రాయంతోనే సీనియర్‌ అధికారులను విభజిస్తామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు అంశంపై గురువారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎంపీ జేడీ శీలం లేవనెత్తారు. ఎప్పటిలోగా విభజన పూర్తిచేస్తారని ప్రశ్నించారు. ఇరు రాష్టాల్ల్రో పాలనకు ఇబ్బంది కలుగుతోందని, ఉద్యోగుల పంపిణీకి ఇంకా ఎంత సమయం తీసుకుంటారన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఎప్పటిలోగా విభజిస్తారని ప్రశ్నించారు. ప్రత్యూష్‌ సిన్హా కమిటీ విధివిధానాలను స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రులను పిలిచి కేంద్రం మాట్లాడాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ కే.కేశవరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడం వల్ల పాలనకు ఆటంకం ఏర్పడుతోందని వివరించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపకంపై ఏర్పాటు చేసిన కమలనాథన్‌ కమిటీ సిఫార్సు చేసిన మార్గదర్శకాల్లో 18ఎఫ్‌ నిబంధన తెలంగాణ ఉద్యోగులకు విరుద్ధమైనదని తెలిపారు. వెంటనే చట్ట ప్రకారం రెండు రాష్టాల్రకు ఉద్యోగులను కేటాయించాలని కోరారు. కాంగ్రెస్‌ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనపై అపాయింటెడ్‌ డే నుంచి పలు సందేహాలు ఉన్నాయని చెప్పారు. రెండు రాష్టాల్ల్రో ఉన్నతోద్యోగుల విభజనపై వివాదం నెలకొందన్నారు. ఉద్యోగుల విభజన ఎప్పుడు పూర్తవుతుఉందో చెప్పాలని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ప్రశ్నించారు.ఐపీఎస్‌ అధికారుల విభజనపై ఏర్పాటుచేసిన ప్రత్యుష్‌ సిన్హా కమిటీ అన్ని సమస్యలు పరిశీలిస్తుందని మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. అఖిల భారత సేవల ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. తాత్కాలిక కేటాయింపులు చేశామని, త్వరలో తుది కేటాయింపుల ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రకటించారు. ఐపీఎస్‌ అధికారుల విభజనపై ఏర్పాటు చేసిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ నివేదిక అందిందని తెలిపారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ.. పారదర్శకంగా ఉద్యోగుల పంపిణీ పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని, అందుకోసమే కొంత ఆలస్యమవుతోందని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే త్వరలో ఇరు రాష్టాల్రకు కేటాయింపులు చేస్తామని వివరించారు.