నగరంపై డేగకన్ను
పోలీస్‌స్టేషన్ల మధ్య గీతలు చెరిపేయండి
పరిధిలేకుండా పనిచేయండి
పోలీసులకు అధునాతన వాహనాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి) : నగరంపై గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలని సీఎం ఆకాంక్షించారు. పోలీసు శాఖకు ఏర్పాటుచేసిన 100 ఇన్నోవాలు, 200 ద్విచక్ర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రజల భద్రత కోసమే పోలీసులకు అధునాతన వాహనాలు అందించినట్లు చెప్పారు. పోలీస్‌స్టేషన్ల మధ్య గీతలు చెరిపేసుకోవాలని, పరిధిలేకుండా పనిచేయాలని ఆయన సూచించారు. మరో మూడు నెలల్లో హైదరాబాద్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తవుతుందని ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పోలీసులకు తెలిసిపోతుందని చెప్పారు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిస్తామన్నారు. పోలీసుస్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా పోలీసులు సేవలు అందించాలని కోరారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి పోలీసింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అతి తక్కువ సమయంలో వాహనాలు తయారు చేశారని, ఇది నగర ప్రజలకు ఒక కానుక అని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన పోలీసు శాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని కోరారు. లండన్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కైం రేటు 85 శాతం తగ్గిపోయిందన్నారు. ఈ విధానాన్ని అధ్యయనం చేసేందుకు త్వరలోనే పోలీసు ఉన్నతాధికారుల బృందం వెళ్లనుందని చెప్పారు. మూడు నెలల వ్యవధిలో సీసీ కెమెరాల నిఘా నీడలో హైదరాబాద్ ఉండనుందని చెప్పారు. నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసేలా నిఘా పెంచుతామని తెలిపారు. నగరంలో ప్రతి ఇంచు స్థలాన్ని 24 గంటలు పోలీసు శాఖ కాపలా కాస్తుందన్నారు. అత్యున్నత అధునాతన సాంకేతిక సదుపాయంతో పక్కా నిఘా ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిన తర్వాత కైం రేటు తగ్గుతుందని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాబోయే కొద్దిరోజులలో బంజారాహిల్స్‌లోని ఎనిమిది ఎకరాల స్థలంలో హైదరాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. న్యూయార్క్ మాన్‌హట్టన్‌లో ఉండే తరహాలో సకల సదుపాయాలతో దీన్ని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఏ వాహనం ఎక్కడ ఉంది, ఏ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలిసేలా అన్ని సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తామని వివరించారు. పోలీసులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త విధానాన్ని అలవర్చుకోవాలని సీఎం కోరారు. పోలీసుస్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా పోలీసులు సేవలు అందించాలని సూచించారు. ఎక్కడ ఏ నేరం జరిగినా ఏ సమస్య తలెత్తినా మా బాధ్యత అన్న రీతిలో పని చేయాలన్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు శాంతిభద్రతలు ఎంతో కీలకమని కేసీఆర్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేకుంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారని వివరంచారు. ఇందుకు సంబంధించి ఒక ఉదాహరణ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు చెందిన ప్రతినిధులు వచ్చి తనను కలిశారని తెలిపారు. విూరు తరచూ బంద్‌లు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి ఆందోళనలు ఉండవని, హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారుతుందని హావిూ ఇచ్చానన్నారు. వారు తననను నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. కానీ వారం పది రోజుల తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరగడంతో ఆ కంపెనీ పత్తా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. పారిశ్రామికవేత్తలు నగరానికి వచ్చి వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలంటే రవాణా, మౌలిక వసతులతో పాటు శాంతిభధ్రతలపైనే ప్రధానంగా దృష్టిసారిస్తారని చెప్పారు. హైదరాబాద్ పోలీసు ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటుందన్న పేరు వస్తేనే పెట్టుబడులు వస్తాయన్నారు. తెలంగాణ చారిత్రక సంధ్యలో పోలీసుల పాత్ర చాలా గణనీయంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో పేకాట క్లబ్బులపై కఠినంగా వ్యవహరించాలని నేనే ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. పేకాట వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల నుంచి తనకు పలువురు మహిళలు ఫోన్‌చేసి మా ఆయన హైదరాబాద్‌కు వచ్చి పేకాట ఆడుతున్నారని చెప్పారని గుర్తుచేశారు. కొంత మంది వ్యక్తులకు ఇబ్బంది కలిగినా పేకాట క్లబ్బులను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. ఇందుకోసం ముంబైలో ట్రాఫిక్‌పై అధ్యయనానికి ఉన్నతాధికారుల బృందం వెళ్తుందన్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. మంచి పనులు జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు వస్తాయని, వాటికి ప్రజలు సహకరించాలన్నారు. ఏం జరిగనా పోలీసులకు సమాచారం తెలియజేసే సంస్కృతి పెరగాలని కోరారు.