‘చంద్రుల’ మధ్య నర్సింహన్‌ సమన్వయం

1

హైదరాబాద్‌, ఆగస్టు 15(జనంసాక్షి) : స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఇరువైపులా బాబు, కేసీఆర్‌లు ఆసీనులై మాట్లాడుకోవడం గమనార్హం. విందుకు వచ్చిన అతిథులను గవర్నర్‌ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ,రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్‌ స్మామిగౌడ్‌, ఉన్నత అధికారులు కుటుంబ సభ్యులతో సహా విందులో పాల్గొన్నారు. డి.శ్రీనివాస్‌, వి.హనుమంతరావు, బండారు దత్తాత్రేయ, జయప్రకాశ్‌ నారాయణ, హైదరాబాద్‌ మేయర్‌ మాజిద్‌ తదితరులు విందుకు హాజరాయ్యరు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తొలిసారిగా చంద్రబాబు, కేసీఆర్‌ కలిశారు. ఇప్పుడు గవర్నర్‌ విందులో రెండోసారి కలుసుకున్నారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం పలువురి దృష్టిని అటు మరల్చింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ అంశాల పట్ల పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్ళాలని గవర్నర్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు గవర్నర్‌ తన ప్రయత్నంలో భాగంగా వారితో దాదాపు 50నిమిషాల పాటు మాట్లాడినట్లు సమాచారం.