ప్రధానిని కాదు.. ప్రధాన సేవకున్ని

2

కార్మిక, కర్షకులే దేశ నిర్మాతలు

అత్యాచారాలు సిగ్గుచేటు

ప్రణాళిక సంఘం రద్దుచేస్తున్నాం

పారిశుధ్య భారత్‌ను నిర్మిద్దాం

ప్రధాని నరేంద్రమోడీ

న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) : తాను ప్రధానిని కాదని.. ప్రధాన సేవకున్నని , కార్మిక కర్షకులే దేశ నిర్మాతలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో అత్యాచారాలు చోటుచేసుకోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రణాళిక సంఘాన్ని రద్దుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పారిశుధ్య భారత్‌ను నిర్మిద్దామని మోడీ పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోటపై మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్దామని ప్రధాని పిలుపునిచ్చారు. పార్టీల కన్నా.. దేశమే మిన్న.. అందరం కలిసి పనిచేద్దామని కోరారు. అన్ని పార్టీలు కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. నేతలు, పాలకులు దేశ నిర్మాతలు కాదు.. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు శాస్త్రవేత్తలే దేశ నిర్మాతలని వ్యాఖ్యానించారు. కలిసి ఆలోచిద్దాం.. కలిసి ముందుకు నడుద్దాం.. అని ఐకమత్యంగా దేశాభివృద్ధికిపాటు పడదామని కోరారు. తాను ప్రధానిగా కాదు.. ప్రధాన సేవకుడిగా విూ ముందుకు వచ్చానని సవినయంగా ప్రకటించుకున్నారు. ప్రతిక్షణం ప్రజల సేవలో భాగస్వామి అయ్యానా లేదా? అన్నదే ముఖ్యం.. దేశ హితం కోసమే అహరహం పని చేస్తామని ప్రకటించారు. దేశాభివృద్ధి మన బాధ్యత కాదు.. మన పూర్వీకుల కల అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశానికి ఏం చేశామని ప్రతిఒక్కరూ ఆలోచించాలని సూచించారు.

అత్యాచారాలపై ఆవేదన

అత్యాచారాల పరంపరపై మోడీ తీవ్రంగా స్పందించారు. ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు మనకు తలవంపులు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆడపిల్లలను కళ్లల్లో పెట్టి చూసుకుంటాం.. కంటిపాపకు దెబ్‌ తగిలితే హృదయం విలవిలలాడదా? అని ప్రశ్నించారు. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మన దేశానికే సిగ్గుచేటని అన్నారు. ‘అత్యాచారాల గురించి విన్నప్పుడల్లా మన తలలు సిగ్గుతో వంచుకోవాలి. తల్లిదండ్రులను ఇక్కడో ప్రశ్న అడగదలచుకున్నా. విూ అమ్మాయి 10-12 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఎక్కడకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, వెళ్లగానే ఫోన్‌ చెయ్యి అని రకరకాలుగా చెబుతుంటాం, ప్రశ్నలు వేస్తాం. అదే విూ అబ్బాయి ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు అలా అడిగారా? ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్న వాళ్లంతా ఎవరో ఒకరి పిల్లలే కదా. ఆ తల్లిదండ్రులు వాళ్లను కూడా ఇలాగే ప్రశ్నిస్తే అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని’ ప్రశ్నించారు. అత్యాచారాలు జరిగినప్పుడు తల్లితండ్రులు తమ అబ్బాయిలతో వాటిపై చర్చించాలని సూచించారు. దేశంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసే వారు ఉన్నారు. తల్లిదండ్రుల కోసం అవివాహితులగా ఉండిపోయిన బిడ్డలూ ఉన్నారని చెప్పారు. స్త్రీపురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు దేవుని సృష్టి కాదు.. మన పాపమేనని మోడీ వ్యాఖ్యానించారు. ‘వైద్యులకు నా విన్నపం, ఆడబిడ్డలను మాతృగర్భంలోనే చిదిమేయకండి. కులం, మతం పేరుతో సాగే హింస అభివృద్ధికి నిరోధకం. కులం, మతం వదిలేద్దాం. చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం’ అని కోరారు.

కలిసి ముందుకు సాగుదాం..

మనమంతా కలిసి పని చేద్దాం..కలిసి నడుద్దాం.. కలిసి ఆలోచిద్దామని ప్రదాని పిలుపునిచ్చారు. పార్టీల కన్నా దేశం మిన్న అని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతికి గత ప్రధానులు, అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయని చెప్పారు. రాజకీయ నేతలు, పాలకులు దేశ నిర్మాతలు కాదని, రైతులూ కార్మికులూ, శాస్త్రవేత్తలూ, ఉపాధ్యాయులే అసలై రాజ్య నిర్మాతలన్నారు. సంఖ్యాబలంతో కాకుండా సామరస్యపూర్వక చర్చల ద్వారా ముందుకు సాగుదామని తెలిపారు. ప్రభుత్వమంటే వివిధ శాఖల కలయిక కాదు.. ఏకోన్ముఖ పథగామి అన్నారు. మానవత్వానికి మించిన దారి మరొకటి లేదని తెలిపారు. హింసను విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. సామ్రాజ్య కాంక్షతో వచ్చిన అశోకుడు సమాజానికి శాంతిసందేశాన్నిచ్చాడని మోడీ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ దేశానికి నేనేం చేశానని ఆలోచించాలని కోరారు. మన భుజాలపై తుపాకులతో కాదు. నాగళ్లతో కదులుదామని పిలుపునిచ్చారు. స్వర్ణ భారతదేశాన్ని నిర్మిద్దామని కోరారు. హింసను వీడి శాంతిమార్గంలో నడిచినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు.

ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ

ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయనున్నట్లు మోడీ ప్రకటించారు. 64 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం, సమాఖ్య వ్యవస్థ బలోపేతం కోసం ఈ వ్యవస్థను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ‘ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో అతిత్వరలో కొత్త వ్యవస్థను తీసుకురానున్నామని’ మోడీ తన ప్రసంగంలో ప్రకటించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం  దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిందని కొనియాడారు. అయితే, ఆ తర్వాత దేశంలో పరిస్థితి మారిపోయిందని, అందుకు అనుగుణంగా కొత్త వ్యవస్థ అవసరముందన్నారు. ‘దేశ అంతర్గత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ వాతావరణం మారిపోయింది. మనం భారత్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే రాష్టాల్రు కూడా ముందుకు వెళ్లాల్సి ఉంది. గత 60 ఏళ్ల కంటే ఇప్పుడు సమాఖ్య వ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని’ చెప్పారు.యువశక్తిని, సృజనాత్మకను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాఖ్యను బలోపేతం చేసుకొనే దిశలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం అవసరమని తెలిపారు.

మన దేశ ఉత్పత్తులు ప్రపంచ విపణిని ముంచెత్తాలని మోడీ ఆకాంక్షించారు. ప్రపంచ యవనికపై భారత్‌కు గుర్తింపు రావాలంటే యువత సింహగర్జన చేయాలని పిలుపునిచ్చారు. మన యువత నైపుణ్య భారతాన్ని సృష్టించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయడం కాదు.. ఉపాధి సృష్టి దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగమంటే దేశ సేవ కోసం అవకాశం వచ్చినట్లేనన్నారు. అభివృద్ధిలో సమతౌల్యం సాధించాలంటే తయారీ రంగం బలోపేతం కావాలని సూచించారు. ‘ఎలక్ట్రికల్స్‌ నుంచి ఎలక్టాన్రిక్స్‌ వరకు మేడ్‌ ఇన్‌ ఇండియా కనబడాలి. రసాయనాల నుంచి ఔషధాల వరకు మేడ్‌ ఇన్‌ ఇండియా కనబడాలని’ కోరారు. ఇప్పటికే ఐటీ నిపుణులు ప్రపంచానికి మన శక్తి ఏమిటో చూపించారు. ఐటీ రంగంలో భారత్‌ స్థాయి ఏమిటన్నది ప్రపంచం గుర్తించిందని చెప్పారు. ఇది ఒకటి, రెండుతో సరిపోదు, ప్రపంచ యవనికపై మనకో గుర్తింపు రావాలని కోరారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్‌ ఉంది కానీ, బ్యాంకు ఖాతా లేదు. ప్రతి కుటుంబాన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం చేయాలని సూచించారు.

కొత్త పథకానికి శ్రీకారం

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని మోడీ అన్నారు. సుపరిపాలన, అభివృద్ధితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రపంచ చిత్రపటం విూద భారతదేశానికి గుర్తింపు రావాలంటే యువత సింహగర్జన చేయాలని కోరారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన అనే కార్యక్రమాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్‌ 11వ తేదీన ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. తద్వారా ఆదర్శ గ్రామాలను పరిశుభ్రం చేయనున్నట్లు తెలిపారు. పరిశుద్ధ భారత్‌ కోసం ఈయోజన పని చేస్తుందన్నారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. 68 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరుగుదొడ్లు కట్టించలేని పరిస్థితికి దేశం వచ్చిందా? తల్లులు, చెల్లెళ్ల కోసం ఇంటికో మరుగుదొడ్డి కట్టించలేమా? అని మోడీ ఆవేదన వ్యక్తం చేవౄరు. ఎంతో మంది పిల్లలు మరుగుదొడ్డి లేక, ఎంతో మంది ఆడపిల్లలు ప్రతి ఏడాది బడి మానేస్తున్నారని చెప్పారు. ఇది సిగ్గుచేటు కాదా? ఇక అటువంటి పరిస్థఙతిన రూపుమాపేందుకు ఏడాదిలో అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిద్దామన్నారు. మనమంతా పరిశుద్ధ్య భారతం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో అట్టడుగున ఉన్న పల్లిల్లోని పిల్లకు ఉన్నత విద్య అందించాలని కోరారు. ఈ గవర్నెన్స్‌ అంటే సుపరిపాలన, సులభ పాలన, సౌలభ్య పాలన అని చెప్పారు. ప్రధాని జనధన యోజన పథకం త్వరలో ప్రవేశపెడతామన్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా, రూ.లక్ష బీమా అందజేస్తామన్నారు.