ఉత్తరాఖండ్‌లో వరదలు
ముంచెత్తుతున్న వానలు
24 మంది మృతి
డెహ్రాడూన్, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు ఏడుగురు మృతి చెందారు. దీంతో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు రెండ్రోజుల్లో మృతిచెందిన వారి సంఖ్య 24కు చేరింది. వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో ఓ మహిళ సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. డేహ్రాడూన్‌కు రెండు కిలోవిూటర్ల దూరంలోని కథ్‌బంగ్లా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగి నివాసాలపై పడడంతో పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించామని చెప్పారు. రెండ్రోజులుగా ఉత్తరాఖండ్‌లో విపరీతంగా వర్షాలు కురుస్తన్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి నివాసాలు, రహదారులపై పడుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే చార్‌ధామ్ యాత్రను నిలిపివేశారు. గతేడాది క్రితం వరద బీభత్సం సృష్టించిన అకాల నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో అవి ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు, వదరల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు 24 మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో మృతి చెందిన వారికి ప్రధాని మోడీ సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారని’ ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.