సివిల్ సర్వీస్ అధికారులు మొదట తెలంగాణకే
మన రాష్ట్రానికే లాటరీ
తేల్చిన ప్రత్యూష్ సిన్హా కమిటీ
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (జనంసాక్షి) :సివిల్ సర్వీస్ అధికారులు మొదట తెలంగాణకే కేటాయిస్తున్నట్లు ప్రత్యూష్ సిన్హా కమిటీ తేల్చిచెప్పింది. సివిల్ సర్వీస్ అధికారుల విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీపై స్పష్టత వచ్చింది. వచ్చే శనివారానికల్లా అధికారుల కేటాయింపు పూర్తయ్యే అవకాశముంది. లాటరీ పద్ధతిలో సీనియర్ అధికారులను ఇరు రాష్టాల్రకు కేటాయించారు. లాటరీ ప్రక్రియ ద్వారా రోస్టర్ విధానంతో అధికారుల కేటాయింపు పూర్తయింది. ముందుగా తెలంగాణ పేరు లాటరీలో రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలుచేశారు. రెండు రాష్టాల్రకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టులను లాటరీ ద్వారానే నిర్ణయించారు. సివిల్ సర్వీస్ అధికారుల విభజనపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం న్యూఢిల్లీలో సమావేశమై తుది కేటాయింపులపై చర్చించింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు శివధర్‌రెడ్డి, మాలకొండయ్య, ఉమేష్ షరాఫ్ తదితరులు హాజరయ్యారు. లాటరీ ద్వారా అఖిలభారత సర్వీసు అధికారులను కేటాయించారు. మొదటి లాటరీ తెలంగాణకు అనుకూలంగా ఉంది. ముందుగా తెలంగాణ పేరు లాటరీలో రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టులను లాటరీ ద్వారానే నిర్ణయించారు. మూడు సర్వీసులకు చెందిన సీనియర్ అధికారులను తెలంగాణకు కేటాయించారు. 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్‌ఎస్ అధికారులను తెలంగాణకు, ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్‌ఎస్-85 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. వచ్చే శనివారానికల్లా అధికారుల కేటాయింపు పూర్తయ్యే అవకాశముందని ఉన్నతాధికారి రేమండ్ పీటర్ తెలిపారు. అధికారుల విభజన 13:10 నిష్పత్తిలో జరుగుతుందని చెప్పారు. గతంలో ఆప్షన్ల కోసం ఇచ్చిన సీల్డ్ కవర్లను కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ప్రత్యూష్ సిన్హా మరోసారి సమావేశమై సివిల్ సర్వీసు అధికారుల పంపిణీని పూర్తిచేస్తుందన్నారు.