మోగిన ఉప ఎన్నికల నగారా

3

ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీ

13న పోలింగ్‌, 16న కౌంటింగ్‌

9 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

తెలంగాణలో మెదక్‌ పార్లమెంట్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల నగారా మోగింది. తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీచేయనుంది. సెప్టెంబర్‌ 13న పోలింగ్‌, 16న కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. గుజరాత్‌లోని వడోదర నియోజకవర్గం నుంచి ఎన్నికైన మోడీ.. వారణాసి నుంచి కూడా విజయం సాధించారు. దీంతో ఆయన వడోదర స్థానాన్ని వదులుకున్నారు. మరోవైపు యూపీలోని అజంగఢ్‌ నుంచి గెలిచిన ములాయం కూడా రాజీనామా చేశారు. దీంతో ఆ రెండుచోట్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ అయ్యింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి, ఆంద్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న నోటిఫికేషన్‌ వెలువడనుంది. 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ఉంటుంది. అనంతరం సెప్టెంబర్‌ 13న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 16న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం, గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కేసీఆర్‌ రెండుచోట్ల గెలుపొందారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మెదక్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌ గుండెపోటుతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీఅయింది. దీంతో ఇక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.