సభాపతుల సమావేశం సక్సెస్‌

4

అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం

హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇరు రాష్ట్రాల సభాపతుల సమావేశం విజవంతంగా ముగిసింది. శనివారం అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు రెండోసారి కరచాలనం చేసిన రోజే రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల మధ్య శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలోని భవనాల పంపకంపై ఒక సామరస్యపూర్వక ఒప్పందం కుదిరింది. కొద్ది రోజుల క్రితం వరకు ప్రతి అంశంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో ”కొత్త మైత్రీబంధం” మరింత పటిష్టం అవుతుందనడానికి ఈ పరిణామం సూచనగా చెప్పవచ్చు. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి శుక్రవారం సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీల మధ్య భవనాలు, ఛాంబర్ల పంపకంపై వారు చర్చలు జరిపారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ కె.స్వామిగౌడ్‌తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సచివాలయ కార్యదర్శులు ఎస్‌.రాజాసదారాం, కె.సత్యనారాయణరావు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కోడెల శివప్రసాద్‌రావు విలేకరులతో మాట్లాడుతూ తమ చర్చలు ఫలప్రదమయ్యాయని, కార్యాలయాలు, ఛాంబర్లను ఎలా పంచుకోవాలన్న విషయమై ఒక సామరస్యపూర్వక ఒప్పందానికి వచ్చామని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలోని భవనాలను రెండు రాష్ట్రాలకు కేటాయించడంపై గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ జారీచేసిన జిఓను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఆయన తెలిపారు. జిఓలో గవర్నర్‌ సూచించిన మేరకు భవనాలను పంచుకోవడానికి తాము ఉభయులం అంగీకరించినట్లు కోడెల తెలిపారు.